బీజింగ్: చైనా టెన్నిస్ స్టార్ పెంగ్ షూయి మాట మార్చింది. తనపై లైంగిక దాడి జరగలేదని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. చైనాకు చెందిన ఓ ప్రముఖ నేత తనను లైంగికంగా వేధించినట్లు ఆమె గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణల తర్వాత పెంగ్ షూయి ఆచూకీ చిక్కలేదు. దీంతో మహిళల టెన్నిస్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాకు పెంగ్ షూయి ఇంటర్వ్యూ ఇచ్చింది. లైంగిక దాడి ఆరోపణలపై ఆన్లైన్లో పోస్టు చేసిన అంశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నట్లు పెంగ్ తెలిపింది. చైనా ప్రభుత్వం పెంగ్‌పై వత్తిడి తెచ్చి ఉంటుందని వుమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ అభిప్రాయపడింది. సింగపూర్‌కు చెందిన చైనా భాషా పత్రికకు పెంగ్ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చింది. తనపై లైంగికంగా దాడి జరిగినట్లు ఎక్కడ చెప్పలేదని, ఎక్కడా రాయలేదని ఆమె పేర్కొన్నది. కానీ నవంబర్‌లో చైనా ఉపాధ్యక్షుడు జాంగ్ గవోలీ తనను లోబర్చుకున్నట్లు వీబో ఫ్లాట్‌ఫామ్‌లో ఆమె ఆరోపణలు చేసింది. ఇక అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోవడంతో.. పలువురు టెన్నిస్ ప్లేయర్లు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.