ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కారజ్ అద్వితీయ ప్రదర్శన కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరైనా ఫర్వాలేదు పడగొట్టడమే లక్ష్యంగా దూసుకెళుతున్న అల్కారజ్ టైటిల్ పోరులో నిలిచాడు. ఆద్యంతం హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో అమెరికా ప్లేయర్ ఫ్రాన్సెస్ టియాఫోపై అద్భుత విజయం సాధించాడు. కొదమసింహాల్లా తలపడిన పోరులో అల్కారజ్దే పైచేయి అయ్యింది. సెట్ సెట్‌కు ఆధిపత్యం చేతులు మారుతూ సాగిన మ్యాచ్‌లో అల్కారజ్ చాంపియన్ ఆటతీరు కనబరిచాడు. టియాఫోను దీటుగా ఎదుర్కొంటూ కీలక పాయింట్లు కొల్లగొట్టాడు. మరోవైపు కరెన్ కచనోవ్‌ను ఓడించిన కాస్పర్ రూడ్..అల్కారజ్‌తో అంతిమ పోరుకు సిద్ధమయ్యాడు. టైటిల్ పోరులో విజేతగా నిలిచే ప్లేయర్‌కు నంబర్‌వన్ ర్యాంక్ దక్కనుంది.
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో కార్లోస్ అల్కారజ్, కాస్పర్ రూడ్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన వేర్వేరు సెమీఫైనల్ మ్యాచ్‌ల్లో అల్కారజ్, రూడ్ అద్వితీయ విజయాలు సొంతం చేసుకున్నారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో స్పెయిన్ నయా స్టార్ అల్కారజ్ 6-7(6/8), 6-3, 6-1, 6-7(5/7), 6-3 తేడాతో అమెరికా ప్లేయర్ టియాఫోను మట్టికరిపించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించాడు. గత కొంత కాలంగా అద్భుత విజయాలతో అదరగొడుతున్న అల్కారజ్..తన దూకుడైన ఆటతీరుతో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచాడు. మరో సెమీస్‌లో కాస్పర్ రూడ్ 7-6(7/5), 6-2, 5-7, 6-2తో కరెన్ కచనోవ్‌పై గెలిచాడు. ఆదివారం అర్ధరాత్రి(భారత కాలమానం ప్రకారం) జరిగే పురుషుల ఆఖరి పోరులో విజేతగా నిలిచే వారు టాప్ర్యాంక్లోకి దూసుకెళుతారు.
రూడ్ రఫ్ఫాట
సింగిల్స్ మరో సెమీస్‌లో రూడ్ తన పదునైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో కచనోవ్‌ను ఉక్కిరిబిక్కిరి చేసి ఈ యేడాది రెండో గ్రాండ్‌స్లామ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఇటీవలి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన రూడ్.. నాదల్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. తొలి సెట్లో టైబ్రేక్‌ను దక్కించుకోడానికి 55 షాట్ల పాయింట్‌ను దక్కించుకుని ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఫ్లషింగ్ మిడోస్‌లో ఫైనల్ చేరిన తొలి నార్వే ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. తొలి సెట్‌ను టైబ్రేక్‌లో గెలుచుకున్న రూడ్ రెండో సెట్లో వరుసగా 14 పాయింట్లు గెలిచి 5-1 ఆధిక్యంలోకి దూసుకుపోయాడు. మూడో సెట్లో రూడ్ 11 అనవసర తప్పిదాలకు పాల్పడడంతో కచనోవ్ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నాలుగో సెట్లో మూడు, అయిదో గేమ్స్‌లో బ్రేక్ సాధించిన రూడ్ ఒక ఫోర్‌హ్యాండ్ విన్నర్‌తో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
రామ్, శాలిస్బరికి పురుషుల టైటిల్
పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జోడీ రాజీవ్ రామ్, జో శాలిస్బరి టైటిల్ దక్కించుకున్నారు. ఫైనల్లో రామ్, శాలిస్బరి జోడీ 7-6(4), 7-5 స్కోరుతో వెస్లీ కూల్‌హాఫ్, నీల్ కుప్సిలపై విజయం సాధించారు. ఓపెన్ శకంలో యూఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నిలబెట్టుకున్న రెండో జోడీ రామ్-శాలిస్బరి. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన టాడ్ ఉడ్‌బ్రిడ్జ్, మార్క్ ఉడ్‌బ్రిడ్జ్ జోడి ఈ ఘనతను అందుకుంది.
సూపర్ అల్కారజ్
అల్కారజ్, టియాఫో మధ్య సెమీఫైనల్ పోరు నువ్వానేనా అన్నట్లు సాగింది. ఐదు సెట్ల పోరులో ఈ యువ ప్లేయర్లు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడ్డారు. ఈ మధ్య కాలంలో తొలి సెట్ ఎప్పుడూ కోల్పోని అల్కారజ్..టియాఫోకు చేజార్చుకున్నాడు. అయినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోని ఈ స్పెయిన్ స్టార్ అద్భుతంగా పుంజుకుని పోటీలోకి వచ్చాడు. బలమైన ఫోర్‌హ్యాండ్, బ్యాక్‌హ్యాండ్ షాట్లతో విరుచుకుపడుతూ కీలకమైన పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ టోర్నీలో వరుసగా ఐదు సెట్ల పాటు మ్యాచ్‌లు ఆడుతూ వస్తున్న అల్కారజ్ ఎక్కడా అలసటకు గురైనట్లు కనిపించలేదు. తన శక్తినంతా కూడదీసుకుంటూ టియాఫోకు దీటైన పోటీనిచ్చాడు.
ఈ క్రమంలో 12 గేమ్‌లలో 10 దక్కించుకుని ఔరా అనిపించాడు. మరోవైపు తానేం తక్కువ కాదన్నట్లు టియాఫో చెలరేగడంతో మ్యాచ్ అభిమానులను అలరించింది. యూఎస్ ఓపెన్‌లో పీట్ సంప్రాస్ నెలకొల్పిన ఎనిమిది టైబ్రేక్ విజయాల రికార్డును టియాఫో సమం చేశాడు. గెలిచి అండీ రాడిక్(2006) తర్వాత ఫైనల్ చేరుకున్న అమెరికా ప్లేయర్‌గా నిలువాలనుకున్న టియాఫో ఆశలపై అల్కారజ్ నీళ్లు గుమ్మరించాడు. టియాఫో నిష్క్రమణతో యూఎస్ టోర్నీలో అమెరికా పోరాటం ముగిసినైట్లెంది. ఇక అమెరికా ఆశలన్నీ మహిళల డబుల్స్పైనే ఉన్నాయి. అమెరికాకు చెందిన కేటి మెక్నాలి, టేలర్ టౌన్సెండ్లు ఫైనల్లో కేటరిన సినియకోవ, బార్బొర క్రెజికోవాలతో తలపడనున్నారు.