ముంబై: టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. వివాహం కోసమే ప్రత్యేకంగా బీసీసీఐ నుంచి అనుమతి తీసుకొని ఇంగ్లండ్తో నాలుగో టెస్టుకు దూరమైన బుమ్రా.. స్పోర్ట్స్ ప్రజెంటర్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ సంజనా గణేశన్ను గోవాలో సన్నిహితుల సమక్షంలో వివాహమాడాడు. ‘ప్రేమ.. మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే మీరు అదృష్టవంతులే. అదే మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తుంది. మేం ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించాం. ఈ రోజు మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు. ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని బుమ్రా పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. దీంతో కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.