అంచనాలకు అనుగుణంగా దూసుకెళ్తున్న ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ ఆష్లే బార్టీ.. సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఫైనల్‌కు చేరింది. నాలుగు దశాబ్దాల తర్వాత తుదిపోరుకు చేరిన తొలి ఆసీస్ ప్లేయర్‌గా బార్టీ రికార్డుల్లోకెక్కగా.. సునాయాస విజయంతో కొలిన్స్ మెగా ఫైట్‌కు అర్హత సాధించింది. శుక్రవారం జరుగనున్న పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్స్‌లో బెర్టినితో నాదల్.. సిట్సిపాస్‌తో మెద్వెదెవ్ తలపనున్నారు!
మెల్బోర్న్: నాలుగు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో ఓ ఆసీస్ ప్లేయర్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ బార్టీ 6-1, 6-3తో అన్‌సీడెడ్ మాడిసన్ కైస్పై విజయం సాధించింది. తద్వారా వెండీ టర్న్‌బుల్ (1980) తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరిన లోకల్ ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. వరుస సెట్లలో విజయం సాధించిన బార్టీ ఐదు ఏస్‌లతో విజృంభించగా.. కైస్ ఓకే ఏస్‌కు పరిమితమైంది. బార్టీ అందివచ్చిన ఆరు బ్రేక్ పాయింట్లలో నాలుగింటిని కైవసం చేసుకోగా.. ప్రత్యర్థి వచ్చిన రెండు అవకాశాలను జారవిడుచుకుంది. మరో సెమీస్‌లో 27వ సీడ్ కొలిన్స్ 6-4, 6-1తో ఏడో సీడ్ స్వియాటెక్‌పై విజయం సాధించింది. మంచి జోరుమీదున్న స్వియాటెక్ ఒక ఏస్ మాత్రమే సంధించగా.. కొలిన్స్ ఏడు ఏస్‌లతో సత్తాచాటింది. ఇరువురు నాలుగేసి డబుల్ ఫాల్ట్స్ చేసినా.. ఆరు బ్రేక్ పాయింట్లు కాచుకున్న కొలిన్స్ మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరుగనున్న తుదిపోరులో టాప్‌సీడ్ ఆష్లే బార్టీతో కొలిన్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
సొంతగడ్డపై ఆడటం ఎంతో ఆనందంగా ఉంది. ఇదే జోరు కొనసాగిస్తూ టైటిల్ సాధించాలనుకుంటున్నా. సెమీస్ విజయం సంతోషాన్నిచ్చింది. ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైనా.. కీలక సమయాల్లో ఆధిక్యం కొనసాగించగలిగా. ఆసీస్ ప్లేయర్‌గా ఇన్నాళ్ల తర్వాత టైటిల్ కోసం బరిలోకి దిగనుండటం కాస్త కొత్తగా అనిపిస్తున్నా.. గెలుస్తాననే నమ్మకముంది.
నాదల్ X బెర్టిని
పురుషుల సింగిల్స్‌లో నయా చరిత్ర లిఖించేందుకు రెండడుగుల దూరంలో ఉన్న స్పెయిన్ బుల్ నాదల్.. శుక్రవారం జరుగనున్న తొలి సెమీఫైనల్లో ఏడో సీడ్ బెర్టినితో తలపడనున్నాడు. రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్‌తో కలిసి ప్రస్తుతం 20 గ్రాండ్‌స్లామ్స్‌తో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న నాదల్.. 21వ గ్రాండ్‌స్లామ్‌తో టాప్కు దూసుకెళ్లాలని చూస్తుంటే.. ఇదే మంచి అదునుగా సత్తాచాటేందుకు బెర్టిని సిద్ధమవుతున్నాడు. మరో సెమీస్‌లో నాలుగో సీడ్ సిట్సిపాస్‌తో మెద్వెదెవ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు.