Mens Hockey World Cup : పురుషుల హాకీ వరల్డ్ కప్-2023 టోర్నమెంట్‌ను అర్జెంటీనా విజయంతో ఆరంభించింది. గ్రూప్ ఏలో జరిగిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది. ఉత్కంఠభరిత పోరులో 1-0తో విజయం సాధించింది. 42వ నిమిషంలో అర్జెంటీనాకు చెందిన మైకో కసెల్లా గోల్ చేయడంతో ఆ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలి అర్థ భాగంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గోల్ చేసేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయితే.. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. రెండో అర్థభాగంలో అర్జెంటీనాకు మూడు పెనాల్టీ కార్నర్లు లభించాయి. కానీ, దక్షిణాఫ్రికా డిఫెండర్లు సమర్థంగా అడ్డుకున్నారు. తర్వాతి మ్యాచ్‌లో అర్జెంటీనా జనవరి 16న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
పురుషుల హాకీ వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. ఒడిశాలోని భువనేశ్వర్, రూర్కెలాలో ఈ మెగా టోర్నీ జరుగుతోంది. గ్రూప్ డిలో ఉన్న టీమిండియా ఈ రోజు స్పెయిన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. జనవరి 29న ఫైనల్ జరగనుంది.