ఎడారి దేశంలో అభిమానులతో కిక్కిరిసిన మైదానాల్లో పదో నంబర్ ఆటగాళ్లు మ్యాజిక్ చేశారు. ఆస్ట్రేలియాతో ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో స్టార్ స్ట్రయికర్ మెస్సీ మెరుపు గోల్‌తో అర్జెంటీనాకు విజయం అందిస్తే.. పొలాండ్‌తో పోరులో డబుల్ గోల్స్‌తో ఎంబాపే ఫ్రాన్స్‌ను గెలిపించాడు.
అల్ రయాన్: డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్.. స్థాయికి తగ్గ ఆటతీరుతో ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. గ్రూప్ దశలో అగ్రస్థానంతో ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టిన ఫ్రాన్స్.. ఆదివారం జరిగిన ఏకపక్ష పోరులో 3-1తో పోలాండ్‌పై ఘనవిజయం సాధించింది. కిలియన్ ఎంబాపే (74వ, 90+1వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో జట్టును గెలిపించగా.. ఒలీవియర్ గిరాడ్ (44వ ని.లో) ఒక గోల్ నమోదు చేసుకున్నాడు. పోలాండ్ తరఫున మ్యాచ్ ఆఖరి క్షణాల్లో రాబర్ట్ లావెన్డాస్కీ ఏకైక గోల్ సాధించాడు. మ్యాచ్ మొత్తంలో 55 శాతం బంతిని తమ అధీనంలో ఉంచుకున్న ఫ్రాన్స్.. ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై 8 సార్లు దాడి చేసి అందులో మూడింటిని గోల్‌గా మలుచుకోగలిగింది. చక్కటి డ్రిబ్లింగ్ నైపుణ్యంతో ఏడుసార్లు కార్నర్ అవకాశాలు దక్కించుకున్న ఫ్రాన్స్.. పోలాండ్ రక్షణ శ్రేణిని బోల్తా కొట్టించడంలో సఫలీకృతమైంది. మరోవైపు 45 శాతం తమ వద్ద బంతి ఉంచుకున్న పోలాండ్.. మూడు సార్లు మాత్రమే ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడి చేసింది. మరికాసేపట్లో తొలి అర్ధభాగం ముగుస్తుందనగా.. ఒలీవియర్ గోల్ కొట్టి ఫ్రాన్స్‌కు ఆధిక్యం అందించగా.. రెండో అర్ధభాగంలో ఎంబాపే హవా కొనసాగించాడు. 74వ నిమిషంలో ప్రత్యర్థి ఆటగాళ్లను షాక్‌కు గురిచేస్తూ.. గోల్‌పోస్ట్‌కు అల్లంత దూరం నుంచి బంతిని నెట్లోకి పంపిన ఎంబాపే.. ఆఖర్లో పోలాండ్ డిఫెండర్లను బోల్తా కొట్టిస్తూ అద్భుత గోల్‌తో ఫ్రాన్స్‌ను తీన్మార్ ఆడించాడు.
మెస్సీ థౌజెండ్‌వాలా..
ఆరంభ పోరులో సౌదీ అరేబియా చేతిలో అనూహ్యంగా ఖంగుతిన్న అర్జెంటీనా.. ఆ తర్వాత గోడకు కొట్టిన బంతిలా విజృంభించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో అర్జెంటీనా 2-1తో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఆర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (35వ ని.లో) తన వెయ్యో మ్యాచ్‌లో సూపర్ గోల్‌తో జట్టుకు శుభారంభం అందించగా.. అల్వరెజ్ (57వ ని.లో) ఓ గోల్ కొట్టాడు. ఈ గోల్‌తో ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా తరఫున అత్యధిక గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా మెస్సీ రికార్డుల్లోకెక్కాడు. సాకర్ విశ్వసమరంలో మెస్సీకిది 9వ గోల్ కావడం విశేషం. 1000వ మ్యాచ్ ఆడిన మెస్సీకి ఇది 789వ గోల్ కాగా.. క్వార్టర్స్‌లో నెదర్లాండ్స్‌తో అర్జెంటీనా తలపడనుంది.