తెలంగాణ నుంచి మరో క్రీడా తార తళుక్కుమన్నది. షూటింగ్లో తన అద్భుత ప్రదర్శనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతూ ఔరా అనిపిస్తున్నది. దిగ్గజ షూటర్ గగన్ నారంగ్ వారసురాలిగా రైఫిల్ షూటింగ్లో ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నది. ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీ ఎదురైనా ఏ మాత్రం వెనుకకు తగ్గకుండా చెక్కుచెదరని గురితో అదరగొడుతున్నది. తిరువనంత పురంలో జరిగిన జాతీయ స్థాయి షూటింగ్లో స్వర్ణ, రజత పతకాలతో మెరిసిన ఆ యువ షూటర్ మరెవరో కాదు రాపోలు సురభి భరద్వాజ్. ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా గేమ్స్‌లో బెర్తు లక్ష్యమంటున్న సురభితో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
జాతీయ స్థాయి టోర్నీలో మీ ప్రదర్శనపై?
తిరువనంతపురంలో తాజాగా ముగిసిన జాతీయ స్థాయి టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబర్చడం చాలా సంతోషంగా ఉంది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకోవడం ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రైఫిల్ షూటింగ్లో క్లిష్టమైన 50మీటర్ల 3పొజిషన్లో రాణించడం ద్వారా ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. ఈ టోర్నీలో నిశ్చల్, సిఫ్ట్ కౌర్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా పతకమే లక్ష్యంగా ముందుకు సాగాను.
తదుపరి లక్ష్యమేంటి?
ఢిల్లీ వేదికగా ఈ నెల 24 నుంచి ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియాగేమ్స్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఈ రెండు ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో సత్తాచాటి భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కానీ అనుకున్నంత సులువు కాకపోవచ్చు. 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో గట్టి పోటీ ఉంది. ముఖ్యంగా అంజుమ్ మౌద్గిల్ లాంటి స్టార్ షూటర్లు పోటీపడుతుండటంతో ట్రయల్స్ రసవత్తరంగా సాగే అవకాశముంది. ఏది ఏమైనా అత్త్యుత్తమ ప్రదర్శనతో మెగాటోర్నీల్లో బరిలోకి దిగాలన్న కసితో పోటీపడుతాను.
శిక్షణ ఎలా కొనసాగుతోంది?
భారత దిగ్గజ షూటర్ గగన్ నారంగ్ నేతృత్వంలో హైదరాబాద్ గన్ ఫర్ గ్లోరీ అకాడమీలో ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నాను. సీనియర్ కోచ్ బిబాసన్ గంగూలీ ఆధ్వర్యంలో రైఫిల్ విభాగంలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటున్నాను. ఈ క్రమంలో టోర్నీ టోర్నీకి మరింత మెరుగవుతున్నాను. శిక్షణ, టోర్నీ ఎంపిక విషయంలో నారంగ్ చక్కని సహకారం అందిస్తున్నారు. టెక్నికల్‌గా మరింత మెరుగవ్వడంతో పాటు షూటర్లను ఎప్పటికప్పుడు ఆయన గైడ్ చేస్తుంటారు.
టోర్నీలకు సన్నద్ధతపై?
సీజన్ చాలా బిజీగా గడుస్తున్నది. టోర్నీ టోర్నీకి మధ్య విరామం తక్కువగా ఉన్నా..ఎక్కడా ఒత్తిడికి లోనుకాకుండా ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మానసికంగా సంసిద్ధమవుతున్నాను. క్లిష్టమైన త్రీ పొజిషన్లో ఫిట్నెస్, మెంటల్ స్టెబిలిటీ చాలా కీలకం. శారీరకంగా, మానసికంగా మెరుగ్గా ఉంటేనే ఈ విభాగంలో సత్తాచాటగల్గుతాం. ఈ విషయంలో ఫిట్నెస్ ట్రైనర్లు, మెంటల్ కండీషన్ కోచ్‌లు చక్కగా సహకరిస్తున్నారు.
ఈ విభాగంలో పోటీ ఎలా ఉంది?
పిస్టల్‌తో పోల్చుకుంటే ఒకింత క్లిష్టమైన ఈ విభాగంలోనూ గట్టి పోటీ ఎదురవుతున్నది. చాలా మంది షూటర్లు రైఫిల్ పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు.దేశం తరఫున అత్యుత్తమంగా రాణించాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.
ఎలా ముందుకు సాగుతున్నారు?
మిగతా క్రీడలతో పోల్చుకుంటే షూటిం గ్ ఖర్చుతో కూడుకున్నది. ఎక్కువగా జర్మనీలో తయారయ్యే రైఫిల్స్‌ను మనం టోర్నీల్లో వాడుతాం. ఒక్కో రైఫిల్ కొనుగోలుకు రూ.4 లక్షల ఖర్చు వస్తుంది. దీనికి తోడు అందులో వాడే బుల్లెట్స్ కూడా విదేశాల నుంచి తెప్పించుకోవాలి. ఈ విషయంలో నారంగ్ అకాడమీ సహకరిస్తున్నది. విదేశాల్లో టోర్నీల కోసం సొంతంగా ఖర్చులు భరించాల్సి వస్తుంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఆశిస్తున్నాను. సీఎం కేసీఆర్ ప్లేయర్లను బాగా ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తే భవిష్యత్‌లో రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసేలా రాణిస్తానన్న నమ్మకం నాకుంది.