తెలంగాణ ఎక్స్‌ప్రెస్

- అథ్లెటిక్స్‌లో దూసుకెళ్తున్న అగసర నందిని
- జాతీయ స్థాయిలో పతకాల మోత
- సత్తాచాటుతున్న గురుకుల విద్యార్థిని
విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్న తెలంగాణ యువ అథ్లెట్ అగసర నందిని.. జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు కొల్లగొట్టి తన సత్తా ఏంటో చాటింది. పారిస్ ( 2024) ఒలింపిక్స్‌లో పతకం పట్టాలని దృఢ సంకల్పంతో ఉన్న నందిని.. ప్రస్తుతం జూనియర్ వరల్డ్ అథ్లెటిక్స్ మీట్‌పై దృష్టి పెట్టానంటున్నది. జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ శిక్షణ.. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న నందిని ప్రస్థానంపై ప్రత్యేక కథనం..
నిరుపేద కుటుంబంలో జన్మించిన నందిని.. పసిప్రాయం నుంచే పరుగును ప్రేమించింది. ఇష్టమైన క్రీడ కావడంతో ఎంత కష్టమైనా.. ముందుకు సాగుతున్న ఈ తెలంగాణ ఎక్స్‌ప్రెస్.. ఇటీవల పటియాల వేదికగా జరిగిన 60వ జాతీయ ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలు కొల్లగొట్టింది. సవాళ్లను అధిగమించడాన్ని అమితంగా ఇష్టపడే నందిని.. 100 మీటర్ల హార్డిల్స్‌లో రజతం సాధించడంతో పాటు సహచర అథ్లెట్లు జివాంజి దీప్తి, హారిక, నిత్యతో కలిసి 4×100 రిలేలో కాంస్యం చేజిక్కించుకుంది. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న నందిని.. ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన ప్రధాన లక్ష్యమని అంటున్నది.
మెరుగవుతున్న టైమింగ్
సీనియర్ ఫెడరేషన్ కప్‌లో 100 మీటర్ల హార్డిల్స్ ఈవెంట్లో గమ్యాన్ని చేరడానికి 13.88 సెకన్ల సమయం తీసుకున్న నందిని.. తాజా పోటీల్లో 13.70 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరి ఔరా అనిపించింది. రోజు రోజుకు టైమింగ్ మెరుగుపర్చుకుంటూ ముందుకు సాగుతున్న నందిని.. ప్రస్తుతం జూనియర్ లెవల్లో భారత్‌లోనే అత్యుత్తమ టైమింగ్‌ను తన పేరిట రాసుకుంది. భవిష్యత్తులో హార్డిల్స్తో పాటు లాంగ్‌జంప్‌లో కెరీర్ కొనసాగించాలనుకుంటున్న నందిని.. తన విజయాల వెనుక జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ సార్ ఉన్నారని అంటున్నది. మెరుగైన శిక్షణ వసతులు, ఆర్థికపరమైన సాయం అందించడంలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు క్రీడాధికారి రామలక్ష్మణ్ ప్రోత్సాహం మరువలేనిదని చెప్పింది.
జూనియర్ వరల్డ్ అథ్లెటిక్స్‌పై నజర్
కెన్యా వేదికగా వచ్చే నెల 17-22 మధ్య జరుగనున్న జూనియర్ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే అవకాశమున్న నందిని.. అక్కడ మెరుగైన ప్రదర్శన చేయడం ద్వారా దేశం దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నది. రోడ్డు పక్కన చాయ్ బండి నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న నందిని తల్లిదండ్రులు.. అంతర్జాతీయ పోటీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చులను భరించే స్థితిలో లేకపోవడంతో.. ప్రభుత్వం నుంచి మరింత ఆర్థిక సాయం లభిస్తే రాష్ర్టానికి, దేశానికి మంచి పేరు తీసుకొస్తానని నందిని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నది.
- 60వ జాతీయ ఇంటర్‌స్టేట్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 100మీటర్ల హార్డిల్స్‌లో రజతం, 4X100మీటర్ల రిలేలో కాంస్యం
- 24వ సీనియర్ ఫెడరేషన్ కప్ జాతీయ అథ్లెటిక్స్ టోర్నీలో రజతం
- సౌత్‌జోన్ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణ పతకాలు
- 36వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు
- ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో రెండు పసిడి పతకాలు
- 65వ జాతీయ నేషనల్ గేమ్స్ అథ్లెటిక్స్ టోర్నీలో కాంస్యం
- 35వ జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (2019)లో రజతం
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో సాంఘిక సంక్షేమ గురుకుల సోసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా అకాడమీల ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నాం. భవిష్యత్‌లో ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు తెలంగాణ నుంచి ప్లేయర్ల ను అందించడమే మా ఏకైక లక్ష్యం
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి
యువ అథ్లెట్ అగసర నందిని జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్నది. టోర్నీ ఏదైనా పతకం సాధించడం లక్ష్యంగా ఎంచుకున్నది. 100మీటర్ల హార్డిల్స్, లాంగ్‌జంప్, 4X100 రిలేలో నందిని అద్భు త ప్రతిభ కనబరుస్తున్నది. పేద కుటుంబం నుంచి వచ్చిన నందిని అంచలంచెలుగా ఎదుగుతున్నది.
నాగపురి రమేశ్, జాతీయ అథ్లెటిక్స్ కోచ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

