Shapoor Zadran : అఫ్గనిస్థాన్ మాజీ క్రికెటర్ షపూర్ జద్రాన్ (Shapoor Zadran) కన్నుమూశాడు. కొన్నాళ్లుగా ప్రాణాంతకమైన జబ్బుతో బాధ పడుతున్న అతడు మృత్యువుతో పోరాడి తనువు చాలించాడు. రోగ నిరోధక వ్యవస్థను నాశనం చేసే హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసిస్టోసిస్ (HLH) కారణంగా 38 ఏళ్ల వయసులోనే జద్రాన్ ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. జద్రాన్ మరణ వార్తను అఫ్గన్ క్రికెట్ ఎక్స్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
మాజీ పేసర్ షపూర్ జద్రాన్ మరణంతో అఫ్గనిస్థాన్ క్రికెట్లో తీవ్ర విషాదం నెలకొంది. పొడగరి పేసరైన అతడి మృతిపట్ల అఫ్గన్ బోర్డు విచారం వ్యక్తం చేసింది. ‘అఫ్గన్ క్రికెట్‌కు పునాది వేసిన వారిలో జద్రాన్ ఒకరు. అతడి అంకితభావం, నిబద్ధత అఫ్గన్ క్రికెట్ అభివృద్ధిలో ఎంతో కీలకమైంది. మా దేశం గర్వపడే ఆటగాడు అతడు. తొలినాళ్లలోనే అఫ్గన్ టీమ్ అంతర్జాతీయంగా గుర్తింపు సాధించడంలో జద్రాన్ కృషి ఉంది’ అని ఏసీబీ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది. కొన్ని రోజుల క్రితం చికిత్స కోసం భారత్‌కు వచ్చిన జద్రాన్.. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందాడు. అయినా అతడి ఆరోగ్యం మెరుగవ్వలేదు.
إِنَّا لِلّهِ وَإِنَّـا إِلَيْهِ رَاجِعُونَ
With profound grief and deep sorrow, the Afghanistan Cricket Board mourns the passing of former Afghanistan fast bowler Shapoor Zadran.
Shapoor Zadran was one of the foundation-laying figures of Afghanistan cricket, whose dedication,… pic.twitter.com/iPIAJ6HLkq
— Afghanistan Cricket Board (@ACBofficials) July 7, 2026
పదిహేడేళ్ల క్రితం అఫ్గనిస్థాన్ క్రికెట్లో అరంగేట్రం చేసిన షపూర్ జద్రాన్ నిరుడు అక్టోబర్ నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. వైద్య పరీక్షల అనంతరం అతడికి హీమోఫాగోసిటిక్ లింఫోహిస్టియోసిస్టోసిస్ (HLH) అనే ప్రాణాంతకమైన జబ్బు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. మామూలుగా చిన్న పిల్లల్లో కనిపించే ఈ జబ్బు 37 ఏళ్ల షపూర్‌లో కనిపించడం డాక్టర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సమస్య కారణంగా ఇన్నిరోజులు షపూర్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడు. హెచ్ఎల్హెచ్ సమస్య కారణంగా వాపు ఎక్కువవుతాయి. రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం మూలంగా.. ఎముకల మజ్జ, కాలేయం, ప్లీహం, లింఫ్ గ్రంథులు వంటి వాటి పనితీరు దెబ్బ తింటాయి.
ఆరడుగుల 2 ఇంచుల పొడవుండే షపూర్ జులపాల జుత్తుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవాడు. అంతర్జాతీయ క్రికెట్లో 80 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడీ పేసర్. 2009 నుంచి 2020 మధ్య కాలంలో ఈ పొడగరి స్పీడ్‌స్టర్ 44 వన్డేలు, 36 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.