AFG vs IRE | అఫ్గానిస్తాన్ – ఐర్లాండ్ మధ్య అబుదాబి వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లు విజయం కోసం పోరాడుతున్నా ఎడ్జ్ మాత్రం ఐర్లాండ్ వైపునకే ఉంది. ఈ టెస్టులో గనక ఐర్లాండ్ గెలిస్తే అది సరికొత్త చరిత్రే. 2018లో టెస్టు హోదా పొందిన ఆ దేశం ఇంతవరకూ ఏడు టెస్టులు ఆడినా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మరి అబుదాబిలో ఐర్లాండ్ ఆ లోటును పూడ్చుకుంటుందా..? అనేది నేడు తేలనుంది. రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 111 పరుగుల ఛేదనలో ఐర్లాండ్.. మూడో రోజు మూడో సెషన్లో 16 ఓవర్లు ముగిసేటప్పటికీ 4 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసి విజయం వైపు దూసుకొస్తుంది. ఆ జట్టు విజయానికి మరో 52 పరుగులు కావాలి.
ఓవర్‌నైట్ స్కోరు 134-3తో మూడో రోజు ఆట ఆరంభించిన అఫ్గానిస్తాన్.. 218 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో రోజు అర్థ సెంచరీ చేసిన కెప్టెన్ హష్మతుల్లా షాహిది (55) నిన్నటి స్కోరుకు మరో రెండు రన్స్ మాత్రమే జతచేసి ఔట్ అయ్యాడు. రెహ్మనుల్లా గుర్బాజ్ (46) ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లలో నవీన్ జద్రాన్ (25) ఒక్కడే కాస్త బెటర్‌గా ఆడాడు. అఫ్గాన్ తొలి ఇన్నింగ్స్‌లో 155 పరుగులకే ఆలౌట్ అవగా ఐర్లాండ్ 263 పరుగులు చేసింది. 108 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటును పూరించిన అఫ్గాన్.. ఐర్లాండ్ ఎదుట మరో 111 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Ireland have a maiden Test victory in their sights!https://t.co/27nSy7gD7N | #AFGvIRE pic.twitter.com/xI0ZYI5T6u
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2024
అయితే లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ తడబడుతోంది. ఆ జట్టు ఓపెనర్ పీటర్ మూర్ డకౌట్ అవగా కర్టిస్ కంఫర్ కూడా అదే బాట పట్టాడు. హ్యారీ టెక్టర్.. రెండు పరుగులకే నిష్క్రమించాడు. 13 పరుగులకే ఆ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపు క్రీజులో నిలిచిన పాల్ స్టిర్లింగ్ (14) కూడా పెవిలియన్ చేరాడు. 16 ఓవర్ల ఆట ముగిసే సమయానికి ఆ జట్టు కెప్టెన్ ఆండ్రూ బల్బిర్ని (31 బ్యాటింగ్), వికెట్ కీపర్ లొరెన్ టక్కర్ (7 బ్యాటింగ్)లు ఐర్లాండ్‌ను విజయం వైపు నడిపిస్తున్నారు.