Nihal Sarin : భారత గ్రాండ్‌మాస్టర్ నిహల్ సరిన్ మరో ఘనత సాధించాడు. కోల్‌కతాలో జరుగుతున్న టాటా స్టీల్ చెస్ ఇండియా-2022 మెన్స్ పోటీల్లో విజేతగా నిలిచాడు. ఈ 18 ఏళ్ల గ్రాండ్ మాస్టర్ ఒక రౌండ్ మిగిలి ఉండగానే విజయం సాధించాడు. ఈ టోర్నీలో 6.9/9 పాయింట్లతో నిహల్ కెరీర్ బెస్ట్ గణాంకాలు నమోదుచేశాడు. అర్జున్ వెరిగైసి (6/9) , విదిత్ గుజరాతీ వరుసగా రెండు, మూడు స్థానాలు సంపాదించారు. ఈ టోర్నీలో నిహల్ తన బెస్ట్ ఫ్రెండ్ అర్జున్ చేతిలో మాత్రమే ఓటమిపాలయ్యాడు.
మహిళల విభాగంలో ఉక్రెయిన్ గ్రాండ్ మాస్టర్ అన్నా ఉషెనిన 6.5 పాయింట్లతో విజేతగా నిలిచింది. మనదేశానికి చెందిన హారిక ద్రోణవల్లి మూడో స్థానంతో (5.5 పాయింట్లు) సరిపెట్టుకుంది. కేరళకు చెందిన నిహల్ 2021లో బియెల్ జిఎంటీ బ్లిడ్జ్‌లో కూడా మొదటి స్థానంలో నిలిచాడు. 14 ఏళ్ల వయసులోనే ఇతను గ్రాండ్‌మాస్టర్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఎలో రేటింగ్ 2600 మార్క్ దాటిన నాలుగో చెస్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.