న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. జట్టును కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకెళ్తాడని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంపై సన్నీ స్పందించాడు. ‘ఆ నిర్ణయం సరైందా, కాదా అనే దాని జోలికి మనం వెళ్లకూడదు. కానీ జట్టుకు ప్రయోజనం చేకూర్చడం కోసమే వారు ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు. జట్టు ప్రదర్శన కూడా పడిపోయింది. నిరంతరంగా క్రికెట్ ఆడుతూ అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో సారథ్య బాధ్యతలతో రోహిత్ కాస్త అలిసిపోయి ఉండవచ్చు. పాండ్యా యువ కెప్టెన్‌గా మంచి ఫలితాలు సాధించాడు’ అని గవాస్కర్ అన్నాడు.