వాషింగ్టన్: మీరు ఎప్పుడైనా కొద్దిసేపు ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారా? విమానాలు ల్యాండయ్యేటప్పుడు, టేకాఫ్ తీసుకునేటప్పుడు చూశారా? చూడటానికి ఇది అద్భుతంగా కనిపిస్తుంది కానీ.. మన చెవులకు మాత్రం చిల్లులు పడటం ఖాయం. ఆ విమానాలు చేసే రణగొన ధ్వనులు తట్టుకోవడం అంత సులువు కాదు. సాధారణంగా ప్రయాణాలకు ఉపయోగించే విమానాల స్పీడూ, అవి చేసే సౌండూ కాస్త తక్కువగానే ఉంటాయి. అదే యుద్ధ విమానాల సంగతి వేరు. ఇవి సూపర్‌సానిక్ (ధ్వని కంటే వేగం) స్పీడుతో ప్రయాణిస్తాయి. అందువల్ల ఇవి చేసే సౌండ్ కూడా చాలా ఎక్కువ. వీటిని నడిపే ఫైటర్ పైలట్లకు ట్రైనింగ్‌లోనే ఈ సౌండ్‌కు అలవాటు పడటం నేర్పిస్తారు.
సౌండ్ చేయని సూపర్‌సానిక్ ప్లేన్
అదే ప్రయాణాలకు ఉపయోగించే సాధారణ విమానాలు మాత్రం వీటితో పోలిస్తే చాలా నెమ్మదిగా వెళ్తాయి. స్పీడు పెరిగితే అవి చేసే శబ్దం కూడా పెరిగి ప్రయాణికులు భరించలేని పరిస్థితి తలెత్తుతుంది. కానీ ఇప్పుడు నాసా మాత్రం ఓ అద్భుతమైన ప్రాజెక్ట్‌పై పని చేస్తోంది. ఇప్పుడున్న కమర్షియల్ విమానాలకు రెట్టింపు వేగంతో ప్రయాణిస్తున్నా.. అసలు ఏమాత్రం శబ్దం చేయని ఓ ప్రయోగాత్మక విమానాన్ని అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా రూపొందిస్తోంది.
ఎలా పరీక్షించారు?
ఎయిర్‌క్రాఫ్ట్ సూపర్‌సానిక్ పనితీరును నిర్ధారించుకోవడానికి నాసా.. ఫ్లుయిడ్ డైనమిక్స్ సిమ్యులేషన్స్‌ను విజువలైజ్ చేసింది. విమానంలో ప్రయాణించేటప్పుడు ఉండే పరిస్థితులు, విమానాన్ని నియంత్రించడానికి పైలట్ ఉపయోగించే సెట్టింగుల అన్ని కాంబినేషన్ల సిమ్యులేషన్ల (ఓ ప్రక్రియను అనుకరించడం)ను ప్రయత్నించి నాసా ప్రత్యేకంగా ఓ డేటాబేస్ క్రియేట్ చేయనుంది. దీనికోసం లాక్‌హీడ్ మార్టిన్‌తో కలిసి పని చేయనున్నట్లు నాసా ఒక ప్రకటనలో తెలిపింది.
ఇందులో భాగంగా రెండు సూపర్‌సానిక్ విమానాలు కాస్త ముందు, వెనుకగా వెళ్తున్నప్పుడు వాటి నుంచి వెలువడే షాక్‌వేవ్స్ ఒకదానిపై మరొకటి ఎలా పని చేస్తున్నాయో గుర్తించి ఆ ఫొటోను క్యాప్చర్ చేసింది. ఈ షాక్వేవ్సే సోనిక్ బూమ్ (భారీ శబ్దం)లాగా భూమిపై ఉన్నవాళ్లకు వినపడతాయి. యూఎస్ ఎయిర్‌ఫోర్స్ టెస్ట్ పైలట్ స్కూల్‌కు చెందిన రెండు టీ-38 విమానాలు 30 అడుగుల దూరంతో ధ్వని కంటే వేగంగా ప్రయాణించాయి.
అసలేంటి క్వైట్ సూపర్‌సానిక్ టెక్నాలజీ ఎక్స్-ప్లేన్ ప్రాజెక్ట్?
ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించే ఈ సూపర్‌సానిక్ ఫ్లైట్ వాణిజ్యపరంగా సాధ్యమా లేదా అని పరిశీలించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. సోనిక్ బూమ్ శబ్ధాన్ని తగ్గించే టెక్నాలజీని ఉపయోగించి ఈ సూపర్‌సానిక్ ఎక్స్-ప్లేన్‌ను తయారు చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ విమానాన్ని నడిపి, తక్కువ శబ్దం చేసే విమానంపై ప్రయాణికుల స్పందనలు తెలుసుకొని ఆ డేటాను 2024లోపు అంతర్జాతీయ రెగ్యులేటర్లకు అందించాలని నాసా భావిస్తోంది. ఈ ప్రయోగం ధ్వని కంటే వేగంగా ప్రయాణించే ప్రయాణికుల, కార్గో విమానాల శకానికి తెర తీయనుంది.