న్యూఢిల్లీ: ఇవాళ (శుక్రవారం), రేపు ఆకాశంలో మరో అద్భుతం కనువిందు చేయనుంది. సౌరకుటుంబంలో అతిపెద్ద గ్రహమైన గురుగ్రహం, శని గ్రహంతో కలిసి మన చందమామ ఒకే దగ్గరి వచ్చినట్లు కనిపించనున్నాయి. దీనినే గ్రేట్ కంజంక్షన్ అని అంటారు. ఈ ఖగోళ వింతను శుక్రవారం, శనివారం రాత్రి సమయంలో సాధారణ కంటితోనూ చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8 గంటల సమయం నుంచి ఈ వింత కనిపించడం ప్రారంభమవుతుంది. చంద్రుడు.. శని గ్రహం దక్షిణ దిశగా 3 డిగ్రీల 45 అంగుళాల కోణంతో కదులుతాడు. ఒకవేళ టెలిస్కోపు ఉంటే.. చంద్రుడికి చాలా దగ్గరగా శని గ్రహం కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శుక్రవారం శనిగ్రహం కంజంక్షన్ కనిపిస్తే.. శనివారం గురు గ్రహం మన చందమామకు దగ్గరగా రానుంది. శనివారం అర్ధరాత్రి ఆకాశంలో ఈశాన్యం వైపు చూస్తే ఇది కనిపిస్తుంది. రాత్రి మొత్తం చంద్రుడు, గురుడు అతి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తారు. టెలిస్కోప్ ఉంటే గురు గ్రహం చుట్టూ నాలుగు చందమామలతో తిరిగే జోవియన్ వ్యవస్థ కూడా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతోపాటు సౌర కుటుంబంలో అతి పెద్ద చందమామ గానిమీడ్ కనిపిస్తుంది.