Threads App | ట్విట్టర్‌కు పోటీగా వచ్చిన థ్రెడ్స్ యాప్ రావడం రావడమే సంచలనాలు సృష్టించింది. యాప్‌ను ప్రారంభించిన తొలి రెండు గంటల్లోనే 20 లక్షల మంది ఖాతాలు తెరవగా.. నాలుగు గంటల్లో ఆ సంఖ్య 50 లక్షలకు పెరిగింది. ఇక ఏడు గంటల్లోనే కోటి మందికి పైగా యూజర్లు థ్రెడ్స్ యాప్‌లో ఖాతాలు తెరవడం విశేషం. అసలు యాప్‌ను లాంఛ్ చేసిన కొద్ది గంటల్లోనే అకౌంట్లు తెరిచేందుకు ఇంతలా ఎందుకు పోటీపడుతున్నారు? ట్విట్టర్‌ను తలదన్నేలా ఈ యాప్‌లో అంత గొప్ప ఫీచర్లు ఏమున్నాయో ఒకసారి చూద్దాం..
థ్రెడ్స్ అనేది ఇన్‌స్టాగ్రామ్‌కు అనుబంధ యాప్. ఇందులో లాగిన్ అవ్వడానికి ఇన్‌స్టా క్రెడెన్షియల్స్‌నే వినియోగించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మాదిరిగానే ఇందులో కూడా ఫొటోలు, వీడియోలను పోస్టు చేయవచ్చు. వీటికి అదనంగా ట్విట్టర్లో మాదిరిగా టెక్స్ట్ కూడా పోస్టు చేయవచ్చు. లింక్‌లను కూడా షేర్ చేయవచ్చు. ట్విట్టర్లో చేసే పోస్టులను ట్వీట్స్ అన్నట్లుగా.. థ్రెడ్స్‌లో చేసే పోస్టులను థ్రెడ్స్ అని వ్యవహరిస్తున్నారు. థ్రెడ్స్‌లో లాగిన్ అయిన తర్వాత ఈ యాప్ నుంచే ఇన్‌స్టాగ్రామ్‌కు పోస్టులు షేర్ చేసుకోవచ్చు. అలాగే ఇన్‌స్టా నుంచి థ్రెడ్స్‌లోకి కూడా షేర్ చేసుకోవచ్చు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న ప్రొఫైల్‌తోనే థ్రెడ్స్‌లోనూ లాగిన్ అవ్వొచ్చు. అందులో ఉన్న పేరే థ్రెడ్స్‌లోనూ చూపిస్తుంది. కావాలంటే థ్రెడ్స్ ప్రొఫైల్‌ను ఎడిట్ చేసి మార్చుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న అకౌంట్లనే థ్రెడ్స్‌లో కూడా డైరెక్ట్ ఫాలో అవ్వచ్చు. ఇందులో ఫాలో అవుతున్న యూజర్ల పోస్టులు మనకు కనిపిస్తాయి. అలాగే మన ఇంట్రెస్ట్‌కు అనుగుణంగా కూడా పోస్టులు కనిపిస్తాయి. మీరు పోస్టులు చేసినప్పుడు మీ ఫ్రెండ్స్‌ను ట్యాగ్ చేసే ఫీచర్ కూడా ఉంది. దీంతో పాటు ఇతరులు మిమ్మల్ని ట్యాగ్ చేయకుండా నియంత్రించవచ్చు. మీరు చేసిన పోస్టులకు వచ్చిన కామెంట్లను డిలీట్ చేసే సదుపాయం కూడా ఉంది. మీ ఫాలోవర్స్‌లో నచ్చిన ప్రొఫైల్‌ను అన్‌ఫాలో చేయవచ్చు. బ్లాక్ లేదా రిపోర్టు కూడా చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేసిన ప్రొఫైల్స్ థ్రెడ్స్ యాప్‌లో కూడా బ్లాక్ అవుతాయి. ప్రస్తుతం ఈ యాప్ యూరోపియన్ యూనియన్ దేశాల్లో తప్ప ప్రపంచంలోని 100కి పైగా దేశాల్లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్‌లలో దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ట్విట్టర్‌ను ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుంచి ఎలాన్ మస్క్ రకరకాల మార్పులు తీసుకొస్తూనే ఉన్నారు. అవన్నీ కూడా నెటిజన్లకు ఇబ్బందికరంగా మారాయి. పెయిడ్ వెరిఫికేషన్‌ను తీసుకురావడం.. యూజర్లు పరిమిత ట్వీట్లు చూసేలా నిబంధనలు విధించడం.. లాగిన్ అవ్వకుండా ఇతరుల ట్వీట్స్ చూడరాకుండా చేయడం వంటి చాలా విషయాలపై నెటిజన్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి సమయంలో థ్రెడ్స్ యాప్ రిలీజ్ అవ్వడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. పైగా ట్విట్టర్లో ఉన్న ఫీచర్లు చాలావరకు ఇందులో ఉండటంతో పాటు అదనపు బెనిఫిట్స్ ఉండటం ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. ఇప్పుడు తీసుకొచ్చిన యాప్‌ను ఇనిషియల్ వెర్షన్ అని మెటా పిలుస్తోంది. దీనికి త్వరలోనే మరిన్ని ఫీచర్లు జోడిస్తామని మెటా చెబుతోంది. ఒకవేళ కొత్త ఫీచర్లు కూడా వస్తే ట్విట్టర్‌ను థ్రెడ్స్ మించిపోవడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కూడా స్పందించారు. ట్విట్టర్‌ను మించిపోవాలంటే కొంత సమయం పడుతుందని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. వంట కోట్ల మంది ఖాతాదారులతో ఓ పబ్లిక్ కన్వర్జేటివ్ యాప్ ఉండాలనేది తను భావిస్తున్నానని.. ఆ అవకాశం ట్విట్టర్‌కు వచ్చినప్పటికీ అది సద్వినియోగం చేసుకోలేకపోయిందని తెలిపారు. ఆ లక్ష్యాన్ని తాము సాధిస్తామనే నమ్మకం ఉందని స్పష్టం చేశారు.
థ్రెడ్స్ యాప్‌పై ప్రశంసలు మాత్రమే కాదు.. విమర్శలు కూడా వస్తున్నాయి. ఇది పూర్తిగా ట్విట్టర్‌ను పోలి ఉందని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. థ్రెడ్స్ యాప్‌ను తీసుకొచ్చేందుకు మెటా కేవలం కీబోర్డులోని కాపీ పేస్ట్‌ను మాత్రమే ఉపయోగించిందని ఓ నెటిజన్ సెటైరికల్‌గా ఓ ట్వీట్ చేశాడు. దానిపై ఎలాన్ మస్క్ స్పందించారు. నవ్వుతున్న ఎమోజీని పోస్టు చేశారు. మరోవైపు జుకర్‌బర్గ్ కూడా దాదాపు 11 ఏండ్ల తర్వాత మళ్లీ ట్విట్టర్లోకి వచ్చారు. ఈ ఉదయం థ్రెడ్స్ యాప్ విడుదల సందర్భంగా ఓ ట్వీట్ చేయడం కూడా సంచలనంగా మారింది.