న్యూయార్క్ : 1976లో యాపిల్-1 కంప్యూటర్ సామర్ధ్యాన్ని డెమో ఇచ్చేందుకు యాపిల్ కో-ఫౌండర్ స్టీవ్ జాబ్స్ వాడిన యాపిల్-1 కంప్యూటర్ ప్రొటోటైప్‌ను వేలానికి ఉంచారు. వేలంలో ఈ అరుదైన డివైజ్ ఏకంగా 5 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ 4 కోట్లు పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆర్ఆర్ ఆక్షన్ హౌస్‌లో దీన్ని వేలానికి పెట్టగా ఇప్పటికే ఆరంభ బిడ్లు 2,00,000 డాలర్లకు వచ్చాయి.
ఆగస్ట్ 18 వరకూ వేలం జరగనుండటంతో పాతతరం యాపిల్-1 కంప్యూటర్ భారీ ధర పలుకుతుందని భావిస్తున్నారు. స్టీవ్ జాబ్స్ తన లాస్ అల్టోస్ ఇంటిలో తన భాగస్వాములు స్టీవ్ వొజ్నియక్, ప్యాటీ జాబ్స్, డేనియల్ కోట్కేతో కలిసి డిజైన్ చేసిన 200 డివైజ్‌ల్లో ఇది ఒకటి. కొన్నేండ్ల పాటు యాపిల్ గ్యారేజీ ప్రాపర్టీలో ఈ ప్రొటోటైప్ పడిఉందని, మూడు దశాబ్ధాల కిందట స్టీవ్ జాబ్స్ స్వయంగా దీన్ని ఓ వ్యక్తికి అందించాడని ఆక్షన్ హౌస్ వెల్లడించింది.
ఈ పరికరం సరైన రీతిలో లేదని, కొన్ని పార్ట్స్‌ను ఇతర యాపిల్-1 కంప్యూటర్స్ కోసం స్టీవ్ జాబ్స్ తొలగించాడని తెలిపింది. వేలంలో యాపిల్-1 కంప్యూటర్స్ వార్తల్లో నిలవడం ఇదే తొలిసారి కాదు. న్యూయార్క్ హౌస్‌కు చెందిన ఓ యాపిల్-1 కంప్యూటర్ 2014లో ఏకంగా 9.5 లక్షల డాలర్లకు ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఇక యాపిల్-1 ప్రొటోటైప్ వేలం ఆర్ఆర్ ఆక్షన్ హౌస్‌కు ఎంత మొత్తాన్ని తీసుకువస్తుందనేది ఆసక్తికరంగా మారింది.