సినిమా : భగవంత్ కేసరి
తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, కాజల్, అర్జున్ రాంపాల్..
దర్శకత్వం: అనిల్ రావిపూడి
నిర్మాతలు: సాహు గారపాటి, హరీశ్ పెద్ది
Bhagavanth Kesari Movie Review | బాలకృష్ణ సినిమా అంటే మాస్లో వైబ్‌ని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. పైగా గత రెండుమూడేళ్లుగా ఆయన ప్రభ దేదీప్యమానమైందనే చెప్పాలి. అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో వందకోట్ల వసూళ్ల మార్కును కూడా దాటేశారు బాలయ్య. ఆ ఊపులో, హ్యాట్రిక్ కొట్టాలనే కసితో తీయబడ్డ సినిమా ‘భగవంత్‌కేసరి’. పైగా అపజయం ఎరుగని అనిల్ రావిపూడి దర్శకుడు కావడంతో సినిమాపై నిర్మాణం నుంచి అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మరి అనుకున్నట్టే బాలయ్య ‘భగవంత్‌కేసరి’తో హ్యాట్రిక్ కొట్టాడా?.. తన గత చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డి స్థాయిలో ఈ ‘భగవంత్ కేసరి’ ఉన్నాడా? తెలుసుకోవాలంటే ముందు కథలోకెళ్లాలి.
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ భగవంత్ కేసరి. అనుకోకుండా అతనుండే ప్రాంగణంలోనే అతని ముందే ఓ హత్య జరగబోతుంటే కేసరి అడ్డుకుంటాడు. కుట్రతో జైల్లోకి ప్రవేశించి హత్యకు తెగబడ్డ దుండగులను మట్టి కరిపించి ఓ ప్రాణాన్ని కాపాడతాడు. దాన్ని ప్రత్యక్షంగా చూసిన జైలు అధికారి భగవంత్ కేసరి నేరానికి సంబంధించిన ఫైల్ తెప్పించుకొని చూసి, అతని వ్యక్తిత్వంపై ఓ నిర్ధారణకు వస్తాడు. భగవంత్‌కేసరి తల్లి చివరిక్షణాల్లో ఉందని తెలిసి చట్టాన్ని అతిక్రమించి భగవంత్కేసరిని తల్లి దగ్గరకు తీసుకెళ్తాడు. కేసరిని ఆఖరి చూపు చూసుకొని తల్లి చనిపోతుంది. అయితే.. చట్టాన్ని అతిక్రమించిన కారణంగా ఆ జైలు అధికారి సస్పెండవుతాడు. తను సస్పెండ్ కావడానికి ముందే తనకున్న పవర్స్, తెలివితేటల్నీ ఉపయోగించి ఆగస్ట్ 15న విడుదలయ్యే ఖైదీల లిస్ట్‌లో భగవంత్‌కేసరి పేరును చేర్చి అతని విడుదలకు సాయపడతాడు జైలు అధికారి. ఆ విధంగా కేసరితో జైలు అధికారికి స్నేహం ఏర్పడుతుంది. జైలు అధికారికి ఒకేఒక్క కూతురు విజ్జి పాప. ఆ పాపను పెంచి పెద్ద చేసి ఆర్మీ ఆఫీసర్ చేయాలనే తనకోరికను భగవంత్ కేసరికి చెబుతాడు జైలు అధికారి. విజ్జి పాపకు భగవంత్కేసరికి తెలీని బంధం ఏర్పడుతుంది. ఇంతలో ఊహించని విధంగా జైలు అధికారి యాక్సిడెంట్‌కు గురై కన్నుమూస్తాడు. విజ్జి పాప బాధ్యతను భగవంత్ కేసరి తీసుకుంటాడు. విజ్జి పాపను ఆర్మీ ఆఫీసర్ని చేసి, ఆమె తండ్రి రుణం తీర్చుకోవాలనుకుంటాడు కేసరి. ఇంతలో విజ్జి పాప అనుకోని ప్రమాదంలో చిక్కుకుంటుంది. అసలు ఈ భగవంత్ కేసరి ఎవరు? ఇతను జైలుకి ఎందుకెళ్లాడు? విజ్జిపాపకు వచ్చిన ప్రమాదం ఏంటి? ఆ ప్రమాదం నుంచి ఆమెను భగవంత్‌కేసరి ఎలా కాపాడాడు? ఆమెను ఆర్మీ ఆఫీసర్ చేయగలిగాడా?.. ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.
బాలకృష్ణ సినిమా కథ అంటేనే లార్జర్ దేన్ లైఫ్. ఒక జీవితాన్ని తెరపై చూపిస్తేగానీ అది బాలయ్య సినిమా అవ్వదనే పాత ఫార్ములానే అనిల్ రావిపూడి కూడా ఫాలో అయ్యాడు. కాకపోతే బాలయ్య వయసుకు తగ్గ కథను ఎంచుకొని విజయానికి తొలి మెట్టు ఎక్కేశాడు. కథ పరంగా చూసుకుంటే పాత కథే. కొన్ని హాలీవుడ్ సినిమాలను ప్రేరణగా తీసుకొని రాసుకున్నాడా అనిపిస్తుంది. అయితే, ఈ తరహా జానర్ బాలయ్యకు మాత్రం కొత్తే. బాలయ్యను కొత్త జానర్లో చూపించి విజయానికి రెండో మెట్టు ఎక్కేశాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా కథ ఓ ఉపకథతో మొదలవుతుంది. అసలు కథ మొదలైనప్పట్నుంచీ స్ట్రైట్ నేరేషనే. మధ్యలో కథ డిమాండ్ మేరకు ఓ చిన్న ఫ్లాష్‌బ్యాక్ మాత్రం ఉంటుంది. ఇందులో అందరికీ నచ్చే అంశం కూతురులాంటి ఓ అమ్మాయి కోసం ఓ పెద్దాయన చేసే పోరాటం. ఆ పోరాటాన్ని ఆసక్తికరంగా నడిపితే హిట్. నడపలేకపోతే సినిమా ఫట్. ఈ విషయంలో అనిల్ రావిపూడి కథను ఆసక్తికరంగా నడిపి విజయానికి మూడో మెట్టు కూడా ఎక్కేశాడు. మొత్తంగా మాస్ సినిమా తీసి, అందులో కామెడీని చొప్పించి, యాక్షన్‌ని మిళితంచేసి, దాంతోపాటు చక్కని సందేశాన్ని కూడా జోడించి దర్శకుడిగా పాసైపోయాడు అనిల్ రావిపూడి
సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు బాలయ్య. తెరపై వన్‌మ్యాన్ షో చూపించాడు. కామెడీ, విషాద సన్నివేశాల్లో బాలయ్య నటన ఒకప్పుడు ఇబ్బందిగా అనిపించేది. కానీ ఈమధ్య ఆయనలో గొప్ప నటుడు కనిపిస్తున్నాడు. కొన్ని సన్నివేశాల్లో తన నటనతో కంటనీరు తెప్పించాడు, కొన్ని సన్నివేశాల్లో కామెడీతో కడుపుబ్బ నవ్వించాడు. ఇక మాస్, యాక్షన్, ఎమోషన్, డైలాగులు.. వీటి గురించి మాట్లాడేదేముంది? ఆ విషయాల్లో ఆయన మాస్టర్. ముఖ్యంగా ఈ సినిమాలో తెలంగాణ మాండలీకాన్ని ఆయన పలికిన తీరు అద్భుతం. తెలంగాణలో ఆయన పలికిన డైలాగులు అభిమానులకు కొత్త అనుభూతిని పంచాయి. ఈ కథకు వెన్నెముక శ్రీలీల పాత్ర. గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్ర చేసింది తను. అద్భుతంగా నటించింది కూడా. కాజల్ పాత్ర పంటికింద కాయిలా అనిపించింది. బాలయ్య కాంబినేషన్లో ఆమెను చూడలేకపోయాం. వయసు తేడా వల్ల కావచ్చు. అయితే ఆ సన్నివేశాలు ఎక్కడా ఎబ్బెట్టుగా అనిపించవు. అర్జున్ రామ్‌పాల్ రొటీన్ విలన్. బాగానే చేశాడు. మిగిలిన పాత్రధారులంతా పరిధిమేర రక్తికట్టించారు.
ఓవర్ బిల్డప్పులు, విసిగించే ఎలివేషన్స్ పెద్దగా లేవు. వాటిని అవసరానికి తగ్గట్టే వాడాడు అనిల్ రావిపూడి. బాలయ్యకు తగ్గ కథ రాసుకున్నాడు. అభిమానులకు కావాల్సిన అంశాలన్నీ చేర్చాడు. అద్భుతమైన డైలాగులు రాసుకున్నాడు. తెలంగాణ స్లాంగ్‌లో బాలయ్య చెప్పే కొన్ని డైలాగులకు విజిల్స్ వినిపిస్తున్నాయి. ఆడపిల్లను పులిలా పెంచాలి అని చెప్పే కథ ఇది. కథ మొత్తాన్ని ఫన్ అండ్ ఎమోషన్స్‌తో నడుపుతూనే ఆడపిల్లల మానమర్యాదలకు చెందిన కీలకమైన విషయాలు బాలయ్య పాత్రతో చెప్పించడం చాలాబావుంది. ఇలాంటి మంచి విషయాలను బాలయ్యలాంటి సూపర్‌స్టార్ చెబితే జనం వింటారనే అనిల్ నమ్మకం ఈ సినిమా విషయంలో నిజమైందనే చెప్పాలి. కాజల్ లాంటి హీరోయిన్ని పెట్టి కూడా డ్యూయెట్స్ జోలికి వెళ్లకుండా కథను డిగ్నిఫైడ్‌గా నడిపించిన అనిల్‌ని అభినందించకుండా ఉండలేం. బాలయ్య కూడా అందుకు ఒప్పకోవడం గొప్ప విషయం. మొత్తంగా దర్శకుడిగా అనిల్ రావిపూడికి మంచి మార్కులే పడ్డాయి. ఇక తమన్ పాటలు బావున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బావుంది. రామ్‌ప్రసాద్ కెమెరా అభిమానులకు విజువల్ ట్రీట్. మొత్తంగా సాంకేతికంగా కూడా సినిమా బావుంది. చివరిగా చెప్పేదేంటంటే.. ప్రథమార్థంలో ఎక్కడా తడబాటు లేదు. ద్వితీయార్థంలో చివరి 20 నిమిషాలు మాత్రం కాస్త తడబడ్డట్టు అనిపిస్తుంది. కథనంలో చిన్న కన్ఫ్యూజన్ కనిపిస్తుంది. మొత్తంగా మంచి సినిమా. అభిమానులకే కాదు, సగటు ప్రేక్షకులు కూడా మెచ్చే సినిమా. అయితే జయాపజయాల గురించి మాత్రం ఇప్పుడే చెప్పలేం. ఈ సినిమాతో విడుదలైన తోటి సినిమాల ఫలితాలు ఎలా ఉన్నాయో చూడాలి. దాన్నిబట్టి ఈ సినిమా రిజల్ట్‌ని చెప్పగలం. అందుకు కొన్ని రోజులు ఆగాల్సిందే.
బాలకృష్ణ నటన, అనిల్ రావిపూడి డైరెక్షన్, తమన్ సంగీతం..
ద్వితీయార్థం కథనంలో కన్ఫ్యూజన్, స్లో నేరేషన్..
రేటింగ్ : 3.00/5