CCTV Cameras | నిద్రావస్థలో నిఘా నేత్రాలు.. .. రిపేర్‌కు నోచుకోని సీసీ కెమెరాలు
యాచారం మండలంలో మేడిపల్లి, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, తులేఖుర్దు, మంథన్‌గౌరెల్లి, నల్లవెల్లి, కుర్మిద్ద, యాచారం, గున్గల్, గడ్డమల్లాయగూడ, నందివనపర్తి తదితర గ్రామాల్లో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి.
- కొన్నేళ్లుగా నిరుపయోగం
- మండలంలో కొనసాగుతున్న వరుస దొంగతనాలు
- పోలీసులకు సవాలుగా మారిన కేసుల ఛేదన
యాచారం మండలంలో మేడిపల్లి, తక్కళ్లపల్లి, కొత్తపల్లి, తులేఖుర్దు, మంథన్‌గౌరెల్లి, నల్లవెల్లి, కుర్మిద్ద, యాచారం, గున్గల్, గడ్డమల్లాయగూడ, నందివనపర్తి తదితర గ్రామాల్లో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించడంలో చూపించిన చొరవ, ఆర్భాటం.. వాటి నిర్వహణలో చూపించలేకపోయారు. దీంతో అవి క్రమక్రమంగా నిరుపయోగంగా, అలంకారప్రాయంగా మారాయి. కొన్ని కెమెరాలు ఆకాశానికి, నేలకు చూడగా, మరికొన్ని కెమెరాలు తుప్పుబట్టి పోయాయి. ఇంకొన్ని ఏకంగా కనుమరుగయ్యాయి. కెమెరాలకు చెందిన సెటప్ బాక్సులు పిట్టగూళ్లకు నిలయంగా మారాయి. అయినప్పటికీ వాటి గురించి పట్టించుకునేనాథుడే కరువయ్యాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. మండలంలో పనిచేయని సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయించి, ఉపయోగంలోకి తీసుకొచ్చి చోరీలు, చైన్ స్నాచింగ్‌లు, అసాంఘిక శక్తుల ఆగడాలు, యాక్సిడెంట్లు తదితర నేరాలను నియంత్రించేందుకు పోలీసులు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
-యాచారం, జూలై 21
CCTV Cameras | మండలంలో ఇటీవలి కాలంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగల ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ పుస్తెలతాడులను ఎత్తుకెళ్తున్నారు. ఇండ్లల్లో దొంగతనాలతో పాటు ఇంటి ముందున్న ద్విచక్ర వాహనాలు, బోరుబావుల వద్ద ఉన్న విద్యుత్ వైర్లు, పొలాల వద్ద ఉన్న గంధపు చెట్లు, ఆఖరికి ఆలయాల వద్ద ఉన్న గుడి గంటలను సైతం దొంగలు ఎత్తుకెళ్తున్నారు. దీనికి తోడు గుర్తుతెలియని వాహనాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాలు సైతం మిస్టరీగా మారుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఆయా గ్రామాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్నవి పనిచేయపోవడమేనని ప్రజలు అంటున్నారు. సీసీ కెమెరాలుంటే దొంగతనాలను ఛేదించడం పోలీసులకు సులభతరమవుతుందని పేర్కొంటున్నారు.
170 కెమెరాలు ఏర్పాటు
పోలీసుల ప్రోద్బలంతో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో మండలంలోని 24 గ్రామపంచాయతీలకుగాను 9 గ్రామపంచాయతీల్లో 170 సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో గడ్డమల్లాయగూడలో18, గున్‌గల్‌లో 30, చింతపట్లలో 24, మేడిపల్లిలో 30, మాల్లో 30, నక్కగుట్టతండాలో 8, తక్కళ్లపల్లిలో 8, కొత్తపల్లిలో 8 సీసీ కెమెరాలు అప్పటి రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ సమక్షంలో ఏర్పాటు చేశారు. రెండో దఫా కింద నందివనపర్తిలో 30, మంథన్గౌరెల్లిలో 30, నల్లవెల్లిలో 24 కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో యాచారం, నందివనపర్తి, తక్కళ్లపల్లితండా, గున్గల్, మాల్ గ్రామాల్లో మినహా మిగతా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఒక్కటి కూడా పనిచేయకపోవడం గమనార్హం.
నేరాలపై నిఘా నేత్రం కరువు
ముఖ్యంగా బస్టాండ్, చౌరస్తాలు, వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు, అంగడి రోజుల్లో సీసీ కెమెరాలు సత్ఫలితాలనిస్తాయని ప్రజలు అంటున్నారు. దొంగతనాలు, పలు రకాల నేరాలను అదుపులోకి తీసుకురావడంతో పాటు అనుమానితులను గుర్తించవచ్చన్నారు. పలు నేరాలకు పాల్పడుతున్న అపరిచితులను, వారి వివరాలను సీసీ పుటేజీల ద్వారా పోలీసులు ఇట్టే తెలుసుకోవచ్చంటున్నారు. కానీ మండలంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో పరిస్థితులు తలకిందులవుతున్నాయని వాపోతున్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో కెమెరాలు కీలకం
సీసీ కెమెరాలు శాంతి భద్రతలను పరిరక్షించడంలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. కొన్ని రకాల కేసుల్లో సీసీ కెమెరాలే ప్రధాన సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. దీంతోనే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సీసీ కెమెరాల ఆధారంగా ఇప్పటికే పలు దొంగతనాల కేసులను తక్కువ సమయంలోనే ఛేదించారు. మండలంలో ఉపయోగంలోలేని సీసీ కెమెరాలను పోలీసులు తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలి.
– మహ్మద్ గౌస్, యాచారం
సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి
గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి. చౌరస్తాలు, వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, బస్టాండ్, సమస్యాత్మక, జనాలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. వ్యక్తిగతంగా ఇండ్ల వద్ద కూడా సీసీలను బిగించుకోవాలి. గ్రామాల్లో నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకురావాలి. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉండేలా మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలి. సీసీల నిర్వహణ కోసం అన్ని విధాలుగా కృషి చేస్తా.
– నరసింహారావు, సీఐ, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

