అబ్దుల్లాపూర్‌మెట్, జనవరి 8 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడ గ్రామానికి చెందిన ఆలేటి ఆటం అనే వ్యక్తి 1999లో ఆలేటి ఆటం వరల్డ్ దాన ధర్మ ధార్మిక పీఠం పేరుతో ఓ అనాథ ఆశ్రమాన్ని స్థాపించాడు. అప్పటి నుంచి అనాథలు, వృద్ధులు, చిన్నారులు, వ్యాధిగ్రస్తులకు ఆశ్రయాన్ని ఇస్తూ సేవా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. నిత్యం అన్నదానం, పండ్లు, పాతబట్టలు ఇస్తూ దాతలు తోచిన సాయం అందిస్తున్నారు. ఈ ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని పిల్లలు కొందరైతే, కొడుకులు, కూతుళ్లు ఉన్నా అనాథలుగా మారినవారెందరో ఉన్నారు. ఎయిడ్స్‌తో మృతి చెందిన తల్లిదండ్రుల పిల్లలనూ ఆటం చేరదీస్తున్నాడు.
ఇద్దరు దంపతుల నేతృత్వంలో ఈ ఆశ్రమం నడుస్తున్నది. మానవ సేవయే మాధవ సేవ అన్న మాటలను నిజం చేస్తున్నారు. మానసిక రోగులు, ప్రాణాంతక వ్యాధుల బారినపడినవారినీ చేరదీసి వారికి మానసిక సాంత్వన చేకూర్చి వారిలో పరివర్తన తీసుకొస్తున్నారు. మానసిక రుగ్మత(మ్యాన్ బైట్ అనే లక్షణాలు) కలిగిన వారినీ చేరదీసి శిక్షణ ఇచ్చి కొత్త జీవితాన్ని అందిస్తూ అందరిచే అభినందనలు పొందుతున్నారు.
ప్రస్తుతం 160 మంది మానసిక రోగులకు మూడు పూటలా భోజనం అందించడంతో పాటు వారిలో మానసిక స్తైర్యాన్ని నింపుతున్నారు. స్థానిక చిల్లర కొట్లు, కూరగాయల దుకాణాల యజమానులు సాయమందిస్తుండగా, కొందరు పాత బట్టలు, బియ్యం అందజేస్తున్నారు. ముఖ్యంగా మానసిక రోగులకు మందులతో అందించే చికిత్సకంటే ప్రేమ పలకరింపులతోనే త్వరగా మామూలు స్థితికి వస్తారని వారు పేర్కొంటున్నారు.
ఈ స్వచ్ఛంద సంస్థను స్థాపించిన ఆలేటి ఆటం కుటుంబమంతా అభాగులకు సేవ చేస్తున్నది. ఆలేటి ఆటం ఉన్నత చదువులు చదివారు. సమాజ సేవే లక్ష్యంగా ఆయన సంస్థను స్థాపించి మానసిక రోగులకు, ప్రాణాంతక హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు సేవలు చేస్తున్నారు. ఆటం అడుగుజాడల్లోనే అతడి భార్య నడుస్తున్నది. లలిత ఆటం కూతురు ఊడుగుల సమైఖ్య, అల్లుడు హరీశ్, సినీ నటుడు బహుబలి వినయ్, రాకేశ్‌మాస్టర్ కూడా సేవలో పాలుపంచుకుంటున్నారు. సోదరుడు ఆనందరావు, ఆయన భార్య ఉష వీరి బంధువులు కూడా సంస్థ ద్వారా సేవ చేస్తున్నారు. ఆటం తల్లి ఆలేటి లింగమ్మ ఆశ్రమంలో రోగులను కనిపెట్టుకుంటూ అక్కడే ఉండేది. రెండు సంవత్సరాల కింద మృతి చెందింది.
23 సంవత్సరాలుగా మహారాష్ట్ర, బీదర్, సూర్యాపేట, లష్కర్‌గూడ, కొత్తగూడలో తమ ఆశ్రమాలు నడుస్తున్నాయి. వాటి ద్వారా వంద మందికి పైగా అభాగ్యుల్లో పరివర్తన తీసుకొచ్చి వారి కుటుంబాలకు అప్పగించాం. ఎక్కడైనా మానసిక రోగులు, అభాగ్యులు కనిపించినా ఆలేటి ఆశ్రమానికి ఫోన్ చేయవచ్చు. ఆసక్తి ఉంటే తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్పించవచ్చు. ఫోన్ నంబర్లు 9346950910, 9849402785
– ఆటం, ఆశ్రమ నిర్వాహకుడు