కొందరిది కొంచెపు బుద్ధి. తినడానికి కొద్దిగ ఉన్నా చాలు.. తమంత తోపు లేడని మిడిసిపడుతుంటారు. ఇలాంటివారిని ఉద్దేశించిన సామెత ‘గిద్దెడు బియ్యానికి పొంగుడు లావు’. అలాంటివారు తమ పద్ధతిని మార్చుకోవడానికి ఇష్టపడరు. అలా అని ఉన్నదాంతో తృప్తిపడరు. ఇంకా ఏదో కావాలని ఆరాటం. ‘గిద్దెడు బియ్యం. పొంగుడు లావు’ తరహాలోనే ఉంటుంది మొత్తంగా వ్యవహారం. బియ్యాన్ని నీళ్లలో ఉడికిస్తే.. ఆ గింజలు సహజంగానే పొంగిపోతాయి.
బియ్యం ఎక్కువగా ఉండి.. ఎసరు తక్కువగా ఉన్నప్పుడు.. వచ్చే పొంగు కాసేపే ఉంటుంది. అదే పెద్దగిన్నెలో గిద్దెడు బియ్యం పోసి ఉడకబెట్టండి.. పొంగు ఏమాత్రం తగ్గదు. ‘అన్నీ ఉన్న ఇస్తరి అణిగిమణిగి ఉంటది.. ఏమీ లేని ఇస్తరి ఎగిరెగిరి పడుతుంది’, ‘నిండుకుండ తొణుకదు’ తదితర సామెతలూ ఇలాంటి అర్థాన్నే ఇస్తాయి. అందుకే చిన్నచిన్న వాటికే పొంగిపోకూడదని.. గొప్పగా, నలుగురికి ఆదర్శంగా ఉండేలా ఆలోచించమనీ పెద్దలు చెబుతారు.