చాలామందికి రహస్యం విలువ తెలియదు. ఒక్క క్షణం కూడా కడుపులో దాచుకోలేరు. వెంటనే ఎవరికో ఒకరికి చెప్పేస్తుంటారు. ఇలాంటివాళ్లను ఉద్దేశించిన సామెత ఇది. వాళ్ల స్వభావమే అంత. ఎంతపెద్ద రహస్యమైనా సరే.. దాని విపరిమాణాల గురించి అస్సలు ఆలోచించరు. ఎవరో ఒకరి దగ్గర కక్కేస్తుంటారు. ఇలాంటి వారి గురించి సాముద్రిక శాస్త్రంలో కూడా ప్రస్తావించారు.
నాలుక మీద మచ్చ ఉన్నవారు రహస్యాలను దాచుకోలేరట. అందుకే ‘నాలుక మీద మచ్చ ఉన్న వ్యక్తులతో జాగ్రత్త.. వాళ్ల నోట్లో నువ్వుగింజ కూడా నానదు’ అని హెచ్చరిస్తుంటారు పెద్దలు. ఇన్ని గింజలు ఉండగా నువ్వుల్నే ఎంచుకోవడం ఆసక్తికరం! చూడటానికి అవి చాలా చిన్నగా ఉంటాయి. నోట్లో నానడానికి ఎంతో సమయం పట్టదు. అంత చిన్నగింజలకు కూడా నోట్లో నానేంత సమయం ఇవ్వని మహానుభావులన్న మాట.