రాష్ట్ర మహిళా మంత్రులు తెలంగాణ గవర్నర్ తమిళిసై కి బహిరంగ లేఖ రాశారు. గవర్నర్ తరచూ చేస్తున్న వివాదాస్పద వాఖ్యలపై మంత్రులు గట్టిగానే స్పందించారు. గవర్నర్‌కు తెలంగాణ యువత పట్ల ప్రేమ ఉంటే తొక్కిపెట్టిన కొలువుల బిల్లులపై వెంటనే సంత కం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యువత ఎదుర్కొంటున్న సవాళ్లకు కేంద్ర ప్రభుత్వమే కారణమని తేల్చి చెప్పారు. యువతకు తీపిరోజులు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలపైన వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరిపై గళమెత్తాలని యువతకు పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియలో తమతో కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తూనే మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ గవర్నర్‌కు ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. మహిళా మంత్రులు రాసిన లేఖ యథాతథంగా..
‘మీరు నిన్న రాజ్‌భవన్‌లో జరిపిన ఉగాది ఉత్సవాల్లో తెలంగాణ యువతకు దక్కాల్సిన అవకాశాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని యువతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని, వాటిని దాటుకొని మంచిరోజులు వస్తాయన్నారు. తెలంగాణ యువత సైతం మీరు ప్రతినిధిగా ఉన్న కేంద్ర ప్రభుత్వ వైఖరి, వివక్ష వల్లనే తమకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని బలంగా నమ్ముతున్నారు. ఒకవైపు స్వయంగా గవర్నర్ హోదాలో మీరు తెలంగాణ యువకుల ఉపాధి అవకాశాలను అడ్డుకునేలా చట్టాలను తొక్కి పెడుతున్న విషయాన్ని సైతం వారు మర్చిపోవడం లేదు. దీంతోపాటు మీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేస్తున్న అనేక అన్యాయాల వల్ల తమకు జరుగుతున్న నష్టాన్ని కూడా గుర్తుంచుకుంటున్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగిన తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల అమలయ్యేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మా ప్రభుత్వం ముందుకువెళ్తున్నది. ఆ దిశగా ఇచ్చిన లక్ష ప్రభుత్వ ఉద్యోగాల హామీని దాటి 2 లక్షల 30 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసుకుంటున్నాం. దీంతోపాటు ప్రైవేటురంగంలో దాదాపు 22 లక్షల మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేలా మా పారిశ్రామిక విధానాన్ని తీర్చిదిద్ది తెలంగాణను ఒక పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చుకున్నాం. ముఖ్యంగా ఐటీరంగంలో భారీగా నూతన ఉద్యోగాలను కల్పించుకుంటూ దేశానికి అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాం. కానీ తెలంగాణపై తొలిరోజు నుంచి ఓర్వలేనితనంతో వ్యవహరిస్తున్న మీ కేంద్ర ప్రభుత్వం ఐటీఐఆర్‌ను రద్దుచేసి హైదరాబాద్, తెలంగాణ యువకుల ఉపాధి అవకాశాలపై భారీ దెబ్బ కొట్టింది. మరోవైపు కేంద్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలను దెబ్బకొడుతూనే, తెలంగాణకు దక్కాల్సిన విద్యాసంస్థల విషయంలోనూ తీరని అన్యాయం చేస్తున్నది.
తెలంగాణ రాష్ర్టానికి ఒక్క నవోదయ పాఠశాలను కూడా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీని కేటాయించలేదు. విభజన చట్టం హామీ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటును తుంగలో తొక్కింది. ఒకవైపు విద్యాసంస్థలు ఇవ్వకుండా కుట్ర చేసిన కేంద్ర ప్రభుత్వం అటు ఉపాధి అవకాశాలను కల్పించే విభజన చట్టం హామీలను సైతం పక్కన పెట్టింది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుచేయడం ద్వారా వేలాదిమంది తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనుకున్నాం. కానీ ఇప్పటిదాకా బయ్యారం విషయంలో కేంద్రం వైఖరిపైన మీరు మాట్లాడలేదు. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా ఉద్యోగాలు వస్తాయనుకున్నాం, దానిపైనా కేంద్రంతోపాటు, మీరు కూడా ఏనాడు స్పందించలేదు. ప్రత్యేక రాయితీలిచ్చి పెట్టుబడులను ప్రోత్సహిస్తామన్న హమీని కూడా కేంద్రం మరిచిపోయింది. ఇక్కడ ఏర్పాటు చేసేందుకు అన్ని అనుకూల పరిస్థితులున్నా, డిఫెన్స్ ఇండస్ట్రియల్ క్లస్టర్ వంటి వాటిని ఏర్పాటుచేయాలని కోరినా కేంద్రం వివక్షతో పక్కనపెట్టింది. ఇలా కేంద్రం తెలంగాణ యువతపైన చూపుతున్న కక్షపూరిత వైఖరిపైన ఏనాడూ ఒక్క మాట మాట్లాడలేదు.
రాష్ర్టానికి గవర్నర్‌గా ఉన్న మీరు కనీసం కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా ఒక్క లేఖనో, విజ్ఞప్తినో చేయకపోవడం దురదృష్టకరం. ఇది తెలంగాణ యువతపైన అవకాశవాద ప్రేమకు అద్దం పడుతుంది. ఇప్పటికైనా తెలంగాణ యువత ఎదుర్కొంటున్న సవాళ్లకు ప్రత్యక్షంగా మీరు కూడా కారణమనే విషయాన్ని గుర్తుచేస్తున్నాం. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి ఉన్నత విద్యాసంస్థలను బలోపేతం చేయాలన్న సమున్నత లక్ష్యంతో తీసుకువచ్చిన యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ బిల్లును తొక్కిపెట్టిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టు అనిపిస్తుంది. దీంతోపాటు యువతకు విద్య, ఉద్యోగ అవకాశాలను అందించాలని ఉద్దేశించిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లులను కూడా మీరు పక్కనపెట్టిన విషయం మర్చిపోయారు.
అందుకే రాష్ట్రంలో యువత ఎదుర్కొంటున్న సవాళ్లకు మీ నాయకత్వంలోని రాజ్‌భవన్, మీరు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీలోని మీ కేంద్ర ప్రభుత్వమే ప్రధానమైన కారణమని, యువత ఇబ్బందులు మీ పుణ్యమేననే విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం. నిజంగానే ఛాలెంజ్‌లను స్వీకరించేందుకు రాజ్‌భవన్ సిద్ధంగా ఉంటే, తెలంగాణ యువత మీకు ఇస్తున్న ఛాలెంజ్‌ను స్వీకరించి కేంద్రప్రభుత్వం వైఖరిపై మాతో కలిసిరండి. యువతకు రాజ్‌భవన్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మాట వాస్తవం అయితే కేంద్రప్రభుత్వ అన్యాయాలను అడ్డుకోండి. తెలంగాణ యువత ఉద్యోగ, ఉపాధి, విద్య అవకాశాలపైన వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపైన గళమెత్తండి. ఈ ప్రక్రియలో మాతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
-మీ…
పి.సబితా ఇంద్రారెడ్డి,
సత్యవతిరాథోడ్,మంత్రులు,తెలంగాణ ప్రభుత్వం