నిజాలు దాస్తున్న నిర్మల
2022 తొలినాళ్లలో చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరింది. 1980 నుంచి ద్రవ్యోల్బణం ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి అని ‘ఎకనమిక్ ఔట్లుక్' నివేదిక పేర్కొనడాన్ని బట్టి ధరల పెరుగుదల ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
కరోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచం ఊపిరి తీసుకుంటున్న వేళ ‘రష్యా-ఉక్రెయిన్’ యుద్ధంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ కారణంగా సరఫరా గొలుసులో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆహార ధాన్యాలు, ఇంధన ధరలు విజృంభించాయి. ప్రపంచదేశాల్లో ద్రవ్యోల్బణం విజృంభించింది. గ్రామీణ ప్రజల ఆదాయం గణనీయంగా పడిపోవడమే కాకుండా ప్రపంచ వృద్ధి రేటూ మందగించిందని పలు నివేదికలు చెప్తున్నాయి.
2022 తొలినాళ్లలో చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యంత గరిష్ఠ స్థాయికి చేరింది. 1980 నుంచి ద్రవ్యోల్బణం ఇంత భారీగా పెరగడం ఇదే మొదటిసారి అని ‘ఎకనమిక్ ఔట్లుక్’ నివేదిక పేర్కొనడాన్ని బట్టి ధరల పెరుగుదల ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో దీన్ని కట్టడి చేయడం కోసం అన్ని దేశాల కేంద్రబ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. పరిస్థితి చక్కబడుతున్నదనే సమయంలో ఆర్థిక మాంద్యం ముప్పు మళ్లీ తెరపైకి వచ్చింది. 2023 నాటికి ఈ మాంద్యం తీవ్రత పెరిగి ప్రపంచ దేశాలను చుట్టుముట్టనుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘ఈ మాంద్యం సామాన్యమైనది కాదు, అత్యంత ప్రమాదకరంగా, సుదీర్ఘంగా ఉండబోతున్నది’ అని ప్రముఖ ఆర్థికవేత్త రోబిని పేర్కొన్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే భారత్ మాత్రం గత మాంద్య ప్రభావాన్ని అధిగమించినట్లే ఇప్పుడు కూడా మాంద్య ప్రభావానికి దీటుగా నిలబడగలదా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
భారత్‌పై మాంద్యం ప్రభావం: ఒకవైపు ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్తలు, ప్రపంచ బ్యాంకు ఈ ఆర్థిక మాంద్యం ముప్పు ప్రపంచం అంతటా విస్తరిస్తోందని చెప్తుంటే భారత్‌కు మాత్రం ఢోకా లేదని కేంద్ర మంత్రులు చెప్తుండటం శోచనీయం. 2008లో భారత్ మాంద్యం ప్రభావానికి గురైంది. అయితే అది తీవ్రమైన ప్రభావం చూపలేదు. దాని ప్రతికూలతలను అనతికాలంలోనే సరిదిద్దుకోవడానికి నాటి పరిస్థితులు అనుకూలించాయి. భారత్ ఎక్కువగా చమురు దిగుమతులపై ఆధారపడుతుంది. మాంద్యం నేపథ్యంలో రానున్నకాలంలో ముడిచమురు ధర మరింత తగ్గిపోయే అవకాశం ఉన్నది. అప్పుడు మనకు ముడిచమురు చౌకగా లభించే అవకాశాలుంటాయి. దీనివల్ల విలువైన విదేశీ మారక ద్రవ్యం మనకు ఆదా అవుతుందనేది మరికొందరి వాదన.
వాస్తవాలను పరిశీలిస్తే 2008లో భారత్ మాంద్యాన్ని ఎదుర్కోగలగడానికి కారణం..దేశంలో గ్రామీణ ఆర్థికవ్యవస్ధ మెరుగ్గా ఉండటం, ప్రభుత్వ రంగ బ్యాంకులు పటిష్ఠంగా ఉండటం. నేడు మాంద్యం ఎదుర్కోవడానికి ప్రభుత్వం చూపించే కారణాలను పరిశీలిస్తే… 2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు వెళ్తుందని ప్రధాని మోదీ ఊదర గొట్టడం. ఈ దశలో ప్రస్తుతం తరుముకువస్తున్న మాంద్యం వల్ల ప్రపంచ వృద్ధి గణనీయంగా తగ్గినా దాని ప్రభావం మనపై తీవ్రంగా ఉండదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తున్నది. ఈ అంశాలు దృష్టిలో ఉంచుకునే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చాలా దేశాలతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉన్నదని, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మనది కూడా ఒకటని, మాంద్యం ప్రభావం మనపై ఉండదని చెప్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే 2008లో మన దేశాన్ని కాపాడిన ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బలహీనపర్చింది. బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణ పేరిట ప్రభుత్వ బ్యాంకుల పగ్గాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో గతంలో మాదిరి మాంద్యాన్ని ఎదుర్కొనే సామర్థ్యం నేడు బ్యాంకింగ్ వ్యవస్ధకు ఉన్నదా అనేది నేడు ప్రధాన ప్రశ్న. ప్రభుత్వ అప్పులు గణనీయంగా పెరిగిపోయాయి. దీంతోపాటు మాంద్యం మనల్ని ఏమీ చేయలేదని ఆర్థిక మంత్రి చెప్తున్న గణాంకాలన్నీ సంఘటిత రంగానివే. దానిలో అసంఘటిత రంగం గణాంకాలను జోడించలేదు. సంఘటిత రంగం వృద్ధి సాధిస్తున్న మాట వాస్తవమే. కానీ, అసంఘటిత రంగం పరిస్థితి నానాటికీ క్షీణిస్తున్నది. ఈ ప్రభావం త్వరలో సంఘటిత రంగంపైనా కనిపిస్తుంది. అప్పుడు మాంద్యం తీవ్రతను ఎదుర్కోవడం చిన్న విషయం మాత్రం కాదు. నాడు ఉన్నంత బలంగా గ్రామీణ భారతం నేడు లేదనేది వాస్తవం. గ్రామీణ, పట్టణ నిరుద్యోగం పెరిగిపోతున్నది. జీఎస్టీ ఆదాయం గణనీయంగా పెరిగింది కాబట్టి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించలేదని ప్రభుత్వం ఘనంగా చెప్పుకోవడం ఎంతవరకు హేతుబద్ధం? మాంద్యం వేళ ప్రజలపై విధించే పన్నుల భారం తగ్గినపుడే కొనుగోలు శక్తి క్షీణించకుండా ఉంటుంది. అప్పుడు మాం ద్యం ప్రభావం బలహీన పడుతుంది. అంటే ఈ సమయంలో ప్రభుత్వ వ్యయం పెరగాలి. తక్షణం ఉత్పత్తి పెంచే చర్యలు చేపడితేనే మాంద్యాన్ని అరికట్టగలం.
సరఫరా గొలుసులో ఏర్పడిన అవాంతరాల కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి సరఫరాలు పెంచాలి తప్ప వడ్డీ రేట్లు పెంచడం పరిష్కారం కాదు. కేంద్రం విధిగా ద్రవ్య విధానపరమైన చర్యలు చేపట్టి, డిమాండ్ వినియోగాన్ని పెం పొందించవలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వినియోగాన్ని పెంచడం ప్రధానం. అంటే వ్యయం పెంచడమే ప్రస్తుతం ఉన్న ఏకైక పరిష్కారం. ప్రభుత్వం చేసే ఈ వ్యయం లో కొంత పేదలకు నగదు రూపేణా బదిలీ చేయాలి. మరి కొంత మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలి. ఇంకొంత బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చేందుకు వినియోగించాలి. దీనివల్ల తమకు సమకూరిన నిధులతో మరింత మందికి రుణాలు మంజూరు చేసే వెసులుబాటు బ్యాం కులకు లభిస్తుంది. తద్వారా మాంద్య ప్రభావాలు క్షీణిస్తాయి. ఇలాంటి ఎన్నో ప్రతికూలతలను గుర్తించి కట్టడి చేయకపోతే నిపుణులు చెప్తున్నట్లుగా దేశాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముట్టడం ఖాయం.
(వ్యాసకర్త: రుద్రరాజు శ్రీనివాసరాజు 94412 39578, లెక్చరర్, ఐ.పోలవరం)
Read Today's Latest Opinions News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

