అరువై ఏండ్లుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కండ్లార చూసి చలించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తన ప్రాంత ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకకు నెట్టివేయపడ్డారని ఆవేదన చెందారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రాష్ట్ర ఏర్పాటు ఒక్కటే మార్గమని నమ్మి ఉద్యమానికి పూనుకున్నారు కేసీఆర్. తెలంగాణ ప్రజలందరినీ ఏకంజేసి ‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అనే నినాదంతో దీక్షకు దిగి రాష్ర్టాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్.
మలి దశ ఉద్యమం కేసీఆర్ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసింది. విద్యార్థి అమరుల త్యాగఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. దేశ రాజకీయాల్లో కేసీఆర్కు ఒక ప్రత్యేకత ఉన్నది. అన్ని రాష్ర్టాలకు ముఖ్యమంత్రులు ఉంటారు కానీ, తెలంగాణకు మాత్రం రాష్ర్టాన్ని తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండటం విశేషం. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజా సంక్షేమం కోసమే. ప్రజా బలమే ఆలంబనగా బంగారు తెలంగాణ వైపు అడుగులు వేయిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు.
రాష్ర్టాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దిన కేసీఆర్ ఇప్పుడు దేశం బాగుకోరి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతం ఇంకా ఆకలి కేకలు వేస్తుండటం ఆయనను కలచివేసింది. పేదలను కొట్టి, పెద్దలకు పెడుతున్న కేంద్ర ప్రభుత్వాల వైఖరిని కేసీఆర్ తప్పుపడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో సామాన్య ప్రజలు కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఒకరకంగా చెప్పాల్నంటే దేశానికి ఇప్పుడు తెలంగాణ ఒక మాడల్. ఇది తెలంగాణ ప్రజల గౌరవానికి ప్రతీక. ప్రతిపక్షాలను వ్యూహ ప్రతివ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేయగల రాజకీయ చాణక్యుడు కేసీఆర్. రాజకీయ విశ్లేషకులకు సైతం కేసీఆర్ అంచనాలు అంతుబట్టవంటే అతని ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుత దేశ రాజకీయాల్లో జాతీయ మీడియా సంస్థలు సైతం కేసీఆర్పై ప్రత్యేక దృష్టి సారించాయంటే అతని ప్రాబల్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ‘పదవులు శాశ్వతం కాదు, ప్రజల గుండెలో చిరకాలం ఉండి పోవడమే నిజమైన రాజకీయం’ అంటాడు కేసీఆర్. ఆయన ఏనాడూ పదవుల కోసం ఆతృత పడలేదు. ప్రజా సేవనే నమ్ముకున్నారు కాబట్టే ప్రజలే రెండు పర్యాయాలు సంపూర్ణ మెజారిటీ తో అధికారంలోకి తీసుకువచ్చారు. ఇకపై బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురానున్నారు. కేసీఆర్ ఆలోచనలు భవిష్యత్ తరాలకు ఆదర్శం కానున్నాయి.
మిద్దె సురేష్ 9701209355