సియోల్ : ఆన్లైన్లో పాత రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి ఫ్రిడ్జ్ కింద ఏకంగా రూ 96 లక్షల నగదు (1.3లక్షల డాలర్లు) కనిపించిన ఘటన దక్షిణ కొరియాలో వెలుగుచూసింది. దక్షిణ కొరియాలోని జెజు ఐలాండ్‌కు చెందిన ఆ వ్యక్తికి రిఫ్రిజిరేటర్ కింద అంత నగదు ఎలా ఉందనే విషయం అంతుబట్టలేదు. ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వగా ఇటీవలే డెలివరీ అయిన ఫ్రిడ్జ్‌ను క్లీన్ చేస్తుండగా ఈ మొత్తం తన కంటపడిందని ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.
నగదు ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్స్‌లో ప్యాక్ చేసి ఫ్రిడ్జ్ కింద ఉంచారు. ఈ డబ్బును సదరు వ్యక్తి పోలీసులకు అప్పగించాడు. ఇంత డబ్బు ఎందుకు ఇక్కడ ఉంచారనే దానిపై ఫ్రిడ్జ్ విక్రేతను గుర్తించేందుకు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఇక దక్షిణ కొరియా చట్టాల ప్రకారం ఈ డబ్బు ఎవరిదనేది గుర్తించని పక్షంలో దాన్ని గుర్తించిన వ్యక్తికే అది చెందుతుంది. అదే జరిగితే రిఫ్రిజిరేటర్ యజమాని మొత్తం నగదులో 22 శాతం పన్నులు చెల్లించగా మిగిలిన మొత్తం సొంతం చేసుకోవచ్చు. డబ్బు వేరొకరిదని తేలినా రిఫ్రిజిరేటర్ ఓనర్‌కు కొంతమొత్తం పరిహారం లభిస్తుంది.