Alkaline Water |మీరెప్పుడైనా ఆల్కలైన్ వాటర్ గురించి విన్నారా? ఈ నీళ్లు మినరల్ వాటర్ కంటే రుచిగా ఉంటాయి. ఆరోగ్యకరం కూడా. కాబట్టే సినిమా యాక్టర్లు, స్పోర్ట్స్ స్టార్లు ఇష్టంగా తాగుతారు. నీళ్లు అంటేనే.. తెల్లగా స్వచ్ఛంగా ఉండాలనుకుంటాం. కానీ ఈ ఆల్కలైన్ వాటర్ మాత్రం.. నల్లగా ఉంటాయి.
నీళ్లు శరీరానికి ఇంధనం. జీవక్రియలో నీటి పాత్ర కీలకమైంది. ఒంట్లోని వ్యర్థాలు వదిలించుకోవాలన్నా, మలబద్ధకాన్ని అధిగమించాలన్నా, రక్త ప్రసరణ సాఫీగా జరగాలన్నా, శరీర ఉష్ణోగ్రత ఉండాల్సిన స్థాయిలో ఉండాలన్నా.. తగినన్ని నీటి వనరులు అవసరం అవుతాయి. అంతేనా, నీళ్లు లూబ్రికెంట్స్‌గా పనిచేస్తూ కీళ్లు అరిగిపోకుండా కాపాడతాయి. నీటి రూపంలోనూ మనకు కొంత శక్తి లభిస్తుంది. మనం తాగే నీటి ప్రభావంతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. నీటిని చూడగానే మనకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. తాగాలని పిస్తుంది.
ఆ జల్లులలో తడిసి ముద్దయి పోవాలనిపిస్తుంది. నీళ్లు మనకు దగ్గరి చుట్టం కూడా. మన శరీరంలో దాదాపు 70 శాతం నీళ్లే ఉంటాయి. ప్రధాన నాగరికతలన్నీ నీటి వనరులు ఉన్న దగ్గరే వెలిశాయి. పుణ్యక్షేత్రాలూ నదీతీరాల్లోనే అవతరించాయి. ఇదీ మనిషికి నీటితో ఉన్న అనుబంధం. నిన్న మొన్నటి వరకూ నీటిని ఉచిత వనరుగానే భావించాం. ‘ఆక్సిజన్ బార్’ గాలిని వినిమయ వస్తువుగా మార్చినట్టే.. ‘ప్యాకేజ్డ్ వాటర్’ నీటిని సరుకుల జాబితాలో చేర్చింది. ఏ వస్తువునైనా యథాతథంగా అమ్మకానికి పెడితే ఎవరూ కొనాలనుకోరు. అదనపు విలువ జోడించాలి. గ్లామర్ అద్దాలి. సెలెబ్రిటీలకు దగ్గర చేయాలి. బ్లాక్ ఆల్కలైన్ వాటర్ పేరుతో బహుళజాతి నీటి వ్యాపారులు చేస్తున్నదీ అదే. భూమి పొరల్లో నిక్షిప్తమైన ఖనిజ వనరులతో జోడించి మరీ ఈ నీటిని శక్తిమంతం చేసినట్టు తయారీదారులు చెబుతున్నారు.
నీటి నాణ్యతను పీహెచ్ స్థాయితో కొలుస్తారు. 7 పీహెచ్ స్థాయిని దాటితే నాణ్యమైన నీటికిందే లెక్క. ఆ ప్రకారంగా బ్లాక్ వాటర్ పీహెచ్ 8.5 ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు. దీనివల్ల నీటికి ఔషధ గుణం తోడవుతుందని అంటున్నారు. రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తాయని, అధిక కొవ్వును కరిగించేస్తాయని వాగ్దానం చేస్తున్నారు. శరీరంలో యాసిడ్ లెవెల్స్‌ను తగ్గించి ఎముకలకు బలాన్నిస్తాయని అనేక అధ్యయనాలు తెలిపాయని ఆధారాలు చూపుతున్నారు. సాధారణ నీటితో పోలిస్తే.. ఎక్కువ కాలం శరీరాన్ని తేమగా ఉంచుతాయని ప్రకటనలు గుప్పిస్తున్నారు. బ్లాక్ వాటర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఫ్రీ రాడికల్స్‌పై పోరాడతాయనే వాదన కూడా ఉంది.
భోజనం తర్వాత తాగితే.. ఆహారంలోని పోషకాలు బాగా వంటబడతాయని పోషకాహార నిపుణుల అభిప్రాయం. భారత్‌కు సంబంధించినంత వరకూ ఇవోకస్ కంపెనీ అర లీటరు నీళ్లను వంద రూపాయలకు అందిస్తున్నది. ఇందులోని సహజ ఖనిజాల ప్రభావంతో నీటికి నల్లరంగు వస్తుంది. కానీ ఈ నీళ్ల వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. మోతాదుకు మించి తాగితే.. వికారం, వాంతులు తదితర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. బ్లాక్ వాటర్ ఎంత తాగాలి అనేది ఆయా వ్యక్తుల నీటి అవసరాలను బట్టి ఉంటుంది.
తారలే తొలి కస్టమర్లు
సానియా మీర్జా, దినేశ్ కార్త్తీక్, మలైకా అరోరా, షారుక్‌ఖాన్ సతీమణి గౌరీఖాన్ తదితరులు ఆల్కలైన్ వాటర్ వీరాభిమానుల జాబితాలో ఉన్నారు. ఒకరిద్దరు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రచారం చేస్తున్నారు కూడా. ‘చాలా కాలం నుంచీ నేను ఈ నీళ్లే తాగుతున్నాను. ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయి. పోషకాలు అపారం. నా గ్లామర్ రహస్యమూ ఇదే’ అంటారు కాజల్ అగర్వాల్.