Wedding Invitation | ఇంటింటికీ వెళ్లి మా ఇంట్లో పెండ్లికి రండి.. అంటూ ఆప్యాయంగా ఆహ్వానించే రోజులు పోయాయి. పెండ్లిపిలుపు ట్రెండ్ మారిపోయింది. ఒకప్పుడు పసుపు, కుంకుమతో బంధువుల ఇండ్లకు వెళ్లి బొట్టు పెట్టి మరీ పెండ్లి పత్రిక చేతికిచ్చి ఆహ్వానించేవారు. ఇంట్లో ఎవరూ లేకుంటే గుమ్మానికి బొట్టు పెట్టి.. పెండ్లి కార్డు తలుపునకు పెట్టేవారు. సమయం సరిపోకపోతే దూరంగా ఉన్న బంధువులకు నాయీబ్రాహ్మణులు లేదా రజకులతో పెండ్లి పత్రికలు ఇచ్చి పంపిణీ చేయించేవారు. ఈ ఆనవాయితీ కొన్ని పల్లెల్లో నిన్నమొన్నటివరకు కొనసాగినా.. మారుతున్న కాలం, పెరిగిన సాంకేతికతో ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. నామమాత్రంగా సంప్రదాయం కోసం వందో, రెండొందలో కార్డులు ప్రింట్ చేయించి దగ్గరిబంధువులకు అందజేస్తున్నారు. మిగితావారికి సోషల్ మీడియా ద్వారానే ఆహ్వానిస్తున్నారు. పెండ్లికార్డు, వధూవరుల ఫొటోలతో ఓ వీడియోను రూపొందించి వాట్సాప్‌లో పెట్టేస్తున్నారు.
-కోటగిరి, ఏప్రిల్ 29
పెండ్లి ఆహ్వానంలో సరికొత్త ట్రెండ్
నాటి పెండ్లి పత్రికల్లో సీతారాములు ఉండేవారు. సీతాదేవి వరమాలతో సిగ్గులొలికిస్తుంటే రాముడు కోదండధారుడై సీతను ఓరచూపులతో చూసే చిత్రం పెండ్లి కార్డుకే అందాన్ని తెచ్చేది. క్రమంగా సీతారాముల స్థానంలోకి వధూవరులు వచ్చేశారు. సింగిల్ కలర్ నుంచి మల్టీకరల్ ఫొటోలు వచ్చేశాయి. ఇప్పటి పెండ్లి కార్డు ఈ-మెయిల్, వాట్సాప్‌లలో వస్తోంది. ఫోన్లో పెండ్లి పత్రికను (పెండ్లి ఫైల్ అనాలి మరి..) ఓపెన్ చేయగానే బ్యాక్‌గ్రౌండ్ పాటతో వధూవరుల ఫొటోలు, వారి పేర్లు, వేదిక, ఆహ్వానితుల వివరాలతో చివరగా ‘డేట్ సేవ్ చేసుకోండి’అని వీడియో ప్లే అవుతోంది. వాట్సాప్‌లో గ్రూప్ కాల్ చేసి.. సమయాభావంతో వ్యక్తిగతంగా వచ్చి కార్డు ఇవ్వలేకపోతున్నాం అంటూ అందరితో ఒకేసారి మాట్లాడి.. పెండ్లికి తప్పకుండా హాజరుకావాలంటూ కోరడం ఇప్పుడు మామూలైంది.
ఒత్తిడిలో మరిచినా.. క్షణాల్లో చేరవేత..
పెండ్లి పనులు ఒక ఎత్తయితే.. కార్డుల పంపిణీ అనేది చాలా పెద్దపనే. అందరినీ గుర్తుంచుకొని ఆహ్వానించడం అంత సులభం కాదు. పెండ్లి పనుల ఒత్తిడిలో పడితే కొందరి పేర్లు గుర్తుకురావు. కార్డులు ఇవ్వడం మర్చిపోతుంటాం. అందుకే.. వాట్సాప్ ద్వారానే ఆహ్వానిస్తున్నాం. వీడియో ప్రోమోలు కూడా వాట్పాప్‌లో సెండ్ చేశాం. సెకన్ల వ్యవధిలోనే అందరికీ ఆహ్వాన పత్రికలు పంపించగలిగాం. గతంలో పెండ్లి కార్డుల పంపిణీకి నెల రోజుల ముందు నుంచే కసరత్తు చేసేవాళ్లం.
వాట్సాప్ గ్రూపులో పెండ్లి సందడి…
బ్రాహ్మణుడు లగ్నపత్రిక రాసింది మొదలు.. ఇంట్లో పెండ్లిసందడి షురువైనట్లే. మెహందీ, సంగీత్, మంగళ స్నానాలు, పెండ్లితేదీ, సమయం, వేదిక మొదలు అన్నింటినీ తెలిపే విధంగా ఒక వాట్సాప్ గ్రూప్‌ను క్రియేట్ చేస్తున్నారు. అందులో బంధువులు, స్నేహితుల ఫోన్ నంబర్లన్నీ చేర్చి.. వేడుకలు షురువైనప్పటి నుంచి ఆ సందడి ఫొటోలను అందులో అప్లోడ్ చేస్తున్నారు. కార్యక్రమానికి హాజరైన బంధుమిత్రులు సైతం పెళ్లికుమార్తె లేదా కుమారుడితో దిగిన ఫొటోలు షేర్ చేయడం కొత్త ఆనవాయితీకి తెరలేపినట్లయ్యింది. ఆ ఫొటోలు చూసినవారికి.. తాము కూడా వేడుకకు వెళ్లాలనే ఆతృత పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
సంప్రదాయం కోసమే పెండ్లి కార్డులు..
కరోనాకు ముందు వరకు ఓ ఇంట్లో పెండ్లి జరిగితే దాదాపు వెయ్యికార్డులు అచ్చువేయించేవారు. ఇప్పుడు సంప్రదాయం కోసం మాత్రమే ప్రింట్ చేయిస్తున్నారు. అవి కూడా లేటెస్ట్ డిజైన్లు కావాలని కోరుతున్నారు. డిజైన్ చేసిన ఆహ్వానపత్రికతో పాటు ప్రోమో వీడియోలను వాట్సాప్ ద్వారానే పంపిస్తున్నారు. దీంతో కార్డుల ప్రింటింగ్ సంఖ్యను తగ్గించారు. గిరాకీ లేక ప్రింటింగ్ ప్రెస్ షాపును మూసేశాను.
– గంగారాం, ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకుడు, కోటగిరి
సైకిల్‌పై వెళ్లి ఊరూరా ఇచ్చేవాళ్లం..
మా నాన్నవాళ్లు సైకిళ్లపై ఊరూరా తిరిగి బంధువులకు పెండ్లి కార్డులు పంపిణీ చేసేవాళ్లు. చాలాదూరమైతేనే బస్సు లో వెళ్లేవారు. నడుచుకుంటూ, ఎడ్లబండిపై కూడా వెళ్లి పంపిణీ చేసిన రోజులున్నాయి. ఇప్పుడైతే గ్రామంలోనే దగ్గరివాళ్లకు పెండ్లి పత్రికలు అందజేస్తున్నారు. మిగితావారికి ఫోన్‌చేసి చెబుతున్నారు. వాట్సాప్‌లో కార్డులు పంపుతున్నారు.
– రమేశ్, రజక కులపెద్ద, ఎత్తొండ
నెలరోజుల ముందు నుంచే..
గతంలో బంధువులకు నెలరోజుల ముందే పెండ్లి కార్డులు ఇచ్చేవారు. దూరపు బంధువులు ఉంటే చాకలి, మంగళివారి సహాయంతో కార్డులను ఇచ్చేవారు. బంధువులు అందుబాటులతో లేకపోతే పక్కింటివారికో లేదంటే దర్వాజకు బొట్టు పెట్టి కార్డును అక్కడే పెట్టేవారు. ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. నోటిమాటగా చెబుతున్నారు. కార్డులు ఇవ్వడం తగ్గించారు. ఏదో వాట్సాప్ అంట.. అందులోనే పెండ్లి కార్డులు పంపిస్తుండ్రు.
– నాగురావు, హంగర్గ
మే 3 నుంచి ముహూర్తాలే..
మే నెల 3 వ తేదీ నుంచి ముహూర్తాలు మొదలవుతునాయి. మే 3, 4, 5, 7, 11, 12, 13, 14, 15, 21, 22, 25, 31, జూన్ 1, 7, 8, 9, 10, 12, 13, 14 తేదీల్లో చాలా మంది పెండ్లికి ముహూర్తాలు ఉన్నాయి.
–రాజేశ్వర జోషి, కోటగిరి