వరి కొయ్యలను కాల్చోద్దు
వరి పంటను రైతులు గతంలో కొడవళ్లతో మొదళ్ల వరకు కోసేవారు. పశువుల పెంపకంపై కూడా రైతులు మక్కువ చూపేవారు. దీంతో వరి గడ్డిని కుప్పలుకప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వచేసేవారు.
- అవగాహన లేమితో కాల్చుతున్న రైతులు
- భూమిలో కలియదున్నితేనే లాభం
- అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
మాక్లూర్, డిసెంబర్ 6 ; వరి పంటను రైతులు గతంలో కొడవళ్లతో మొదళ్ల వరకు కోసేవారు. పశువుల పెంపకంపై కూడా రైతులు మక్కువ చూపేవారు. దీంతో వరి గడ్డిని కుప్పలుకప్పలుగా పశుగ్రాసం కోసం నిల్వచేసేవారు. ప్రస్తుతం సాగు విధానంలో అనేక మార్పులొచ్చాయి. పశువుల సంఖ్య తగ్గిపోవడంతో యంత్రాలను విరివిగా వినియోగిస్తున్నారు. హార్వెస్టింగ్ చేసే సమయంలో పైకి కోయడంతో కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి. అవసరమున్న రైతులు కొంత గడ్డిని కోసి తీసుకెళ్తున్నారు. మిగిలిన దానిని అక్కడే వదిలేస్తున్నారు. మళ్లీ దుక్కి దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరికొయ్యలతోపాటు గడ్డిని కూడా కాలబెడుతున్నారు. దీంతో అధిక నష్టాలు వచ్చే అవకాశమున్నదని, వరి కొయ్యలను తగులబెట్టొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తున్నాయి. సారవంతమైన భూమి దెబ్బతింటున్నది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యల మిగులు అవశేషాలతో సిరులు సంపాదించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. వరి కోత అనంతరం ఉండే గడ్డిని పశువులకు వాడడం లేదా కంపోస్టుగా మార్చుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
కొయ్యలను కాల్చడంతో అనర్థాలు..
పొలంలో కొయ్యలను కాల్చడం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నదని శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతులు అవగాహన లేమితో పంటకు ఎంతో మేలు చేసే కొయ్యలను భూమిలో కలియదున్నకుండా కాల్చివేసి భవిష్యత్ పంటలను నాశనం చేస్తున్నారని, వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నారని చెబుతున్నారు. కొయ్యలను కాల్చివేసే క్రమంలో భూమి గట్టిపడుతున్నదని, పొలాన్ని కలియదున్నడం వీలుకాదని పేర్కొంటున్నారు. కొయ్యలను కాల్చివేయడంతో భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు నాశనమవుతున్నాయని, దీంతో భూమి గుల్లగా మారే పరిస్థితి ఉందని చెబుతున్నారు. నాట్లు వేసిన వేర్లకు సరిగ్గా పోషకాలు చేరవని, పైరు పెరగదని వివరిస్తున్నారు. రైతులు ఎక్కువగా యూరియాను వినియోగించాల్సి వస్తున్నదని, కానీ దాన్ని స్వీకరించి వేర్లకు అందించే సూక్ష్మజీవులు అప్పటికే అంతరించిపోవడంతో ప్రయోజనం లేకుండా పోతున్నదని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో యూరియాను అతిగా వాడడంతో భూమిలోకి చేరి భూగర్భ జలం విషతుల్యమవుతుందని, వాతావరణంలో అనేక మార్పులు కలుగుతాయని చెబుతున్నారు. కార్బన్ డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ గాలిలో కలిసి వాతావరణం, జీవకోటిపైన తీవ్ర ప్రభావం చూపుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
కలియదున్నితేనే లాభం..
పంట కోసిన వెంటనే వరి కొయ్యలను కాల్చకుండా పొలంలోనే కలియదున్నాలి. దీంతో కొయ్యలు మట్టితో కప్పబడి కుళ్లే పక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత సేంద్రియ ఎరువుగా మారుతుంది. వరి కొయ్యలను కలియదున్నడం, కుప్ప చేయడంతో నేలల్లో పగుళ్లు రాకపోవడం, తేమ ఆవిరి కావడం తగ్గి భూమి కోతకు గురికాకుండా ఉంటుంది. కొయ్యలను కలియదున్ని వెంటనే కుళ్లి పోయేలా పొటాషియం చల్లితే సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. తదుపరి పంటకు పోషకాలు విపరీతంగా పెరుగుతాయి.
రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..
వరి కొయ్యలు కాల్చకుండా కలియదున్నుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. కలియదున్నితే భూ సారం పెరుగుతుంది. భూమిలోని సూక్ష్మజీవులు నశించవు. పర్యావరణం దెబ్బతినదు. వరి కొయ్యలను కలియదున్నితే భూమికి కాంప్లెక్స్ ఎరువులతో సమానంగా సేంద్రియ ఎరువుగా పని చేస్తుంది. గ్రామాల్లో రైతులకు వరి కొయ్యల కాల్చివేతతో కలిగే నష్టాలపై అవగాహన కల్పిస్తున్నాం.
– పద్మ, వ్యవసాయాధికారిణి, మాక్లూర్
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

