న్యూఢిల్లీ: జీ టీవీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్‌ను నోయిడా పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీకి చెందిన వీడియోను టీవీలో తప్పుడు రీతిలో ప్లే చేసిన కేసులో అతన్ని అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ వీడియోను ప్లే చేసినందుకు ఆ టీవీ యాజమాన్యం క్షమాపణలు కూడా చెప్పింది. రాహుల్ వీడియో అంశంలో యాంకర్ రోహిత్‌ను చత్తీస్ఘడ్ పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో యాంకర్ రోహిత్.. యూపీ పోలీసుల సహాయం కోరారు. చత్తీస్ఘడ్ బృందం అరెస్టు చేయడానికి ముందే నోయిడా పోలీసులు ఆ యాంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రాహుల్ గాంధీ నియోజవకర్గం వయనాడ్‌లో ఉన్న ఆఫీసుపై కొందరు యువకులు ఇటీవల దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనను ఖండిస్తూ రాహుల్ ఓ వీడియో రిలీజ్ చేశారు. చిన్నపిల్లలు బాధ్యతారహితంగా ప్రవర్తించారని, కానీ ఆ పిల్లల్ని వదిలి పెట్టాలని రాహుల్ అన్నారు. అయితే ఈ వీడియోను జీ న్యూస్ తప్పుగా ప్లే చేసింది. ఇటీవల ఉయద్పూర్లో జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ రాహుల్ వీడియోను చూపించింది. ఉదయ్‌పూర్ నిందుతుల్ని వదిలిపెట్టాలన్న ఉద్దేశం వచ్చేలా రాహుల్ వీడియోను ప్లే చేసింది. దీనిపై దుమారం రేవడంతో జీ న్యూస్ క్షమాపణలు చెప్పింది. కానీ కేసును సీరియస్‌గా తీసుకున్న చత్తీస్ఘడ్ పోలీసులు ఇవాళ యాంకర్ రోహిత్‌ను అరెస్టు చేసేందుకు అతని ఇంటికి వెళ్లారు.ఆ సమయంలో నోయిడా పోలీసులు జోక్యం చేసుకున్ని ముందస్తుగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు.