కన్నడ అమ్మాయి అయితేనేం.. తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. జీ తెలుగు ‘సీతే రాముడి కట్నం’ సీరియల్లో సీత పాత్రకు అతికినట్టు సరిపోయింది. చిరునవ్వుల సీతమ్మగా చిన్నతెరపై పెద్ద ఇమేజ్ సంపాదించింది వైష్ణవి. ఆ కబుర్లన్నీ ఆమె మాటల్లోనే..
Vaishnavi | జీవితం వేరు. సీరియల్స్, సినిమాలు వేరు. ప్రతి జీవితంలో సినిమాల్లో ఉన్నన్ని మలుపులు, సీరియల్స్‌లో కనిపించే డ్రామాలు ఉండకపోవచ్చు. మాది బెంగళూరు. ఎగువ మధ్యతరగతి కుటుంబం. నాదో చిన్నపాటి ప్రపంచం. నేను, మా పేరెంట్స్, మా కజిన్స్.. అంతే! ఆటలాడుకున్నా, దెబ్బలాడుకున్నా వాళ్లతోనే. ప్రత్యేకించి కారణం చెప్పలేను కానీ, నాలుగో తరగతిలోనే నటన పట్ల ఆసక్తి మొదలైంది. హీరోయిన్ కావాలని కలలుకనేదాన్ని. గుడికెళ్లిన ప్రతిసారీ నా కోరిక నెరవేర్చమంటూ దేవుణ్ని ప్రార్థించేదాన్ని. పరమాత్మ నా మొర ఆలకించాడేమో.. ఇంటర్లో ఉండగానే తొలి అవకాశం వచ్చింది. అలా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. ఇదిగో ఈ రోజు మీ ముందు నిలబడ్డాను.
నటన గురించి చెప్పగానే అమ్మ ఒప్పుకోలేదు. ‘సీరియల్స్ చేసినా చదువులను మాత్రం నిర్లక్ష్యం చేయను’ అని అమ్మకు మాటిచ్చాకే.. షూటింగ్‌కు బయల్దేరాను. ఆ వాగ్దానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఇంటర్ నుంచి డిగ్రీ వరకూ ప్రతి పరీక్షలో ఫస్ట్‌క్లాస్‌కు తగ్గలేదు. కన్నడలో నా తొలి సీరియల్ ‘మిథునరాశి’ సూపర్‌హిట్ అయ్యింది. నిరాటంకంగా వెయ్యి ఎపిసోడ్లు వచ్చాయి. అదో రికార్డ్. అప్పటికి నాకు పదహారేండ్లు. దాదాపు మూడేండ్లు ఒకే పాత్రకు అంకితమయ్యాను. నా టీనేజ్‌లో చాలా భాగం ఆ ప్రాజెక్ట్‌కే సరిపోయింది. తమిళ, మలయాళ పరిశ్రమల్లో పనిచేసినా.. తెలుగు సీరియల్స్‌లో నటించాలనే కోరిక ఎప్పటినుంచో ఉండేది. అదీ తీరిపోయింది. జీ తెలుగు ‘సీతే రాముడి కట్నం’లో సీత పాత్రతో బాగా కనెక్ట్ అయిపోయాను. సాధారణంగా హీరోయిన్ పాత్ర ఏడుపుగొట్టుగా ఉంటుంది. కానీ, సీత మొహం మీద చిరునవ్వు చెదరదు. ఆ కల్మషంలేని స్వభావం నన్ను ఆకట్టుకుంది. మంజులా నిరుపమ్ లాంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం ఓ మంచి అనుభవం.
అందం కంటే వ్యక్తిత్వమే గొప్పదని నా పాత్రద్వారా చెప్పించారు దర్శకుడు. వయసుతోపాటు అందం కరిగిపోతుంది. చిన్నపాటి ప్రమాదం చాలు.. వికృతంగా మారడానికి. అదే వ్యక్తిత్వం.. శాశ్వతమైంది. కన్నడంలో సినిమాల్లోనూ చేశాను. తెలుగులోనూ మంచి స్క్రిప్ట్ వస్తే తప్పక ఓకే చెబుతాను. సినిమాలకు సంబంధించి.. ప్రకాశ్‌రాజ్‌గారి నటన నన్ను ఆకట్టుకుంటుంది. అభిమానుల విషయానికొస్తే.. నన్నో చెల్లిగా, కూతురిగా అభిమానిస్తారు. ప్రేమగా పలకరిస్తారు. ఒకటిరెండు సార్లు ఆ అభిమానం హద్దులు దాటిన సంఘటనలూ ఉన్నాయి. ఓ అభిమాని ఆటోగ్రాఫ్ కోసం వచ్చాడు. చొక్కా విప్పేసి.. తన ఒంటి మీద సంతకం చేయమని అడిగాడు. దాని మీద టాటూ వేయించుకుంటాడట! చాలా ఇబ్బందిగా అనిపించింది. సున్నితంగా తిరస్కరించాను. అన్నట్టు నేను క్లాసికల్ డ్యాన్సర్‌ని. సమయం దొరికినప్పుడు సాధన చేస్తుంటాను. మంచి మంచి పుస్తకాలూ చదువుతాను.
– హరిణి