ఏ శిల్పి కల్పనవో… ఏ కవి భావనవో!
ప్రియురాలిని కేవలం ఒక మనిషిగా కాకుండా ‘ఏ శిల్పి కల్పనవో... ఏ కవి భావనవో’ అనడం ద్వారా అమెలోని సౌందర్యాన్ని ఒక అద్భుతమైన శిల్పంతో, కవిత్వంతో పోల్చారు. ఇక్కడ ఉపమేయమైన ప్రియురాలిని ఉపమానమైన కల్పన/భావనలుగా ఊహించడం వల్ల ఇది ఉత్ప్రేక్ష లేదా రూపక శైలిని సంతరించుకుంది.
తొలిప్రేమ దీపం వెలిగించిన గీతం
ఏ భాషలోనైనా మానసిక విశ్లేషణతో కూడిన చిత్రాలు తక్కువేనని చెప్పాలి. సమాజంలో మంచివారు, చెడ్డవాళ్లు ఉన్నట్లే సినిమా కథలోను హీరో వర్గం, విలన్ వర్గాలనే రెండు గ్రూపులు కనిపిస్తాయి. అయితే ఒక్క మనిషిలోనే మంచి చెడులను చూపించిన చిత్రం గుడిగంటలు. మనిషి పట్ల ఓవర్ పొసెసివ్‌నెస్, కొంత శాడిజం, అసూయ, కొన్ని సమయాలలో కరుణ, ప్రేమ వీటన్నిటిని కలిగి ఉన్న మనిషిగా హీరో పాత్ర రూపొందింది. ‘ఇలా అనేక వైరుధ్యాలున్న కథానాయకుడిలో కళాకారుడిని (చిత్రకారుడిగా) చూపడం, పాత్ర రూప కల్పనలో చూపిన శ్రధ్ధను తెలియజేస్తుంది.
తమిళంలో శివాజీ గణేశన్, ఎస్.ఎస్.రాజేంద్రన్, బి.సరోజా దేవి తదితరులతో తీసిన ‘ఆలయమణి’ చిత్రాన్ని 1964లో సుందర్ లాల్ నహత, డూండి, రాజ్యలక్ష్మి సంస్థ బ్యానర్‌పై, వి.మధుసూదన్ రావు దర్శకత్వంలో ‘గుడిగంటలు’ పేరుతో పునర్నిర్మించారు. కథలో హీరో చిత్రకళాకారునిగా నాయికను చూసినపుడు ప్రణయ భావోద్వేగానికి గురైన సన్నివేశానికి దాశరథి పాటను రాశారు.
పల్లవి
నీలోన నన్నే నిలిపేవు నేడే…
ఏ శిల్పి కల్పనవో… ఓ..
ఏ కవి భావనవో..
చరణం 1
ఎల్లోర గుహలో పిల్ల ఉంది నీలో..
నండూరివారి ఎంకి ఉంది నీలో…
అల విశ్వనాథ చెలి కిన్నెరుంది…
మా బాపిరాజు శశికళ ఉంది… /నీలోన /
చరణం 2
ఖయ్యాము కోలిచే సాకివి నీవే..
కవి కాళిదాసు శకుంతల నీవే..
తొలి ప్రేమదీపం వెలిగించినావే..
తొలి పూలబాణం వేసింది నీవే…//నీలోన //

Cineegeetha Sharathi
తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధమైన భావ కవిత్వపు ఛాయలతో, ప్రణయ భావనలతో సాగిన ఈ పాటలో కవి ప్రధానంగా భావాలను సాధారణ రూపం కంటే ఎంతో ఉన్నతంగా చూపించడానికి వైవిధ్యమైన అలంకారాలను ఉపయోగించారు. ప్రియురాలిని కేవలం ఒక మనిషిగా కాకుండా ‘ఏ శిల్పి కల్పనవో… ఏ కవి భావనవో’ అనడం ద్వారా అమెలోని సౌందర్యాన్ని ఒక అద్భుతమైన శిల్పంతో, కవిత్వంతో పోల్చారు. ఇక్కడ ఉపమేయమైన ప్రియురాలిని ఉపమానమైన కల్పన/భావనలుగా ఊహించడం వల్ల ఇది ఉత్ప్రేక్ష లేదా రూపక శైలిని సంతరించుకుంది. అంతేకాదు.. భౌతికంగా స్థిరంగా ఉండే ఒక రాతి శిల్పాన్ని, కదిలే ఒక సజీవ సుందరిగా ఊహించి వర్ణించడం ‘ఎక్‌ఫ్రాసిస్’ శైలికి అద్భుతమైన ఉదాహరణ.
ఈ పాటలోని అసలైన సౌందర్యం తెలుగు సాహిత్యానికి సంబంధించిన గొప్ప ప్రతీకలను (Literary Allusions) ప్రస్తుత ప్రేమకు ముడిపెట్టడంలో ఉంది: తెలుగు భావకవిత్వంలో నండూరివారి ‘ఎంకి పాటలు’ అత్యంత ప్రసిద్ధమైనవి. స్వచ్ఛమైన, అచ్చమైన పల్లెటూరి ప్రేమికురాలికి ఎంకి ప్రతీక. ప్రియురాలిలో ఆ నిష్కల్మషమైన ప్రేమ ఉందని కవి శ్లాఘిస్తున్నారు. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి ‘కిన్నెరసాని పాటలు’ తెలుగులో ఒక అద్భుత కావ్యం. కరిగి నీరైపోయే కిన్నెరసాని లాంటి అమాయకపు, ఆర్ద్రత కలిగిన సౌందర్యం నీలో ఉందని భావం. అడవి బాపిరాజు గారు సృష్టించిన ప్రసిద్ధ శిల్పకళా సుందరి ‘శశికళ’. ఆధునిక తెలుగు నవలల్లో సౌందర్యానికి, కళాభిరుచికి ఆమె మార్గదర్శి. కేవలం తెలుగు సాహిత్యమే కాకుండా, సంస్కృత మహాకవి కాళిదాసు అపురూప సృష్టి అయిన ‘శకుంతల’ సౌందర్యాన్ని, అలాగే ఉమర్ ఖయ్యామ్ రుబాయీలలోని మైమరిపించే ‘సాకి’ (మధువును అందించే సుందరి)లోని లాలిత్యాన్ని కూడా ప్రియురాలికి ఆపాదించడం ద్వారా కవి ప్రణయ భావాన్ని సమగ్రంగా వ్యక్తం చేశారు.

Cinee Geetha Dasharathi
ఘంటసాల గారు ఎంతో సాత్వికంగా ప్రేమికుని కళాహృదయానికి తగినట్లు ఎఫ్.మేజర్ (4వ శ్రుతిలో శంకరాభరణం రాగం)లో స్వరపరచి, తన సహజమైన గంభీర స్వరంతో కాకుండా, సున్నితంగా, మృదువుగా పాడారు. కారణం నాయకుడు ఒక చిత్రకారుడనే అవగాహన కలిగి ఉండటమే! ఘంటసాల గానానికి సుశీలమ్మ ఆలాపనలు ఆద్యంతమూ వెన్నెలకు పరిమళం అద్దినట్లుంది. తెరపై అభినయంలో భాగంగా ఎన్.టి.రామారావు, చిత్రాన్ని గీస్తుంటే నటి కృష్ణ కుమారి ఎల్లోర శిల్పం, ఎంకి, కిన్నెరసాని, శకుంతల, శశికళ రూపాలలో అభినయిస్తుంది. దాశరథి, ఈ గీతంలో కూడా తొలిప్రేమ దీపం వెలిగించడం విశేషం.
డాక్టర్ వి.వి.రామారావు
రచయిత, వ్యాఖ్యాత, గాయకుడు
9849237663
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

