‘నాగశౌర్యకు చక్కగా సరిపోయిన టైటిల్ ఇది. వరుడిగా అతడి గెటప్ బాగుంది. సినిమా విజయవంతమైన తర్వాత నాగశౌర్యకు పెళ్లిచూపుల ఆహ్వానాలు భారీగా అందుతాయని అనుకుంటున్నా’ అని అన్నారు రానా. గురువారం హైదరాబాద్‌లో ‘వరుడు కావలెను’ ట్రైలర్‌ను ఆయన విడుదలచేశారు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మీసౌజన్య దర్శకురాలు. ఈ నెల 29న విడుదలకానుంది. నాగశౌర్య మాట్లాడుతూ “ఛలో’ సక్సెస్ వేడుకలో లక్ష్మీసౌజన్య ఈ కథ వినిపించింది. అప్పుడే సూపర్‌హిట్ అవుతుందని బలంగా నమ్మాను. సితార సంస్థ వల్ల సినిమా స్థాయి పెరిగింది. గణేష్ రావూరి చక్కటి సంభాషణలు రాశారు. మంచి కథతో ఈ సినిమా చేసినందుకు గర్వపడుతున్నా’అని తెలిపారు. ‘కుటుంబ కథాంశాలతో మా సంస్థ చేసిన సినిమాలు పెద్ద విజయాల్ని సాధించాయి. ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో మరోసారి వర్కవుట్ అవుతుంది. యువతరానికి చక్కగా కనెక్ట్ అవుతుంది’ అని నిర్మాత చెప్పారు. ఆకాష్, భూమి అనే జంట కథ ఇదని, వినోదం, భావోద్వేగాలు, సంగీతం, అన్ని చక్కగా కుదిరాయని మాటల రచయిత గణేష్ రావూరి పేర్కొన్నారు.