హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): పీఆర్సీ అమలులో జాప్యం జరిగితే మరో ఉద్యమం తప్పదని టీఎస్ యూటీఎఫ్ హెచ్చరించింది. ప్రభుత్వం నివేదికను తెప్పించుకుని మెరుగైన ఫిట్మెంట్ అమలు చేయాలని, లేకపోతే నవంబర్‌లో మరో పోరాటం తప్పదని ప్రకటించింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి మాట్లాడుతూ.. పబ్లిక్ స్కూళ్ల పేరిట సర్కార్ బడులను మూసివేయడం గర్హనీయమని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లను మూసివేస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. ప్రాథమిక పాఠశాలల పాలిట మరణశాసంగా మారిన జీవో-25ను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. సర్వీసు నిబంధనల సమస్యలను పరిష్కరించిఉద్యోగోన్నతులు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం బాధ్యులు రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సింహాచలం, సమ్మారావు, రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.