ఒట్టావో: కెనడా రాజధాని ఒట్టావోలో ఆ నగర మేయర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు నిరసన చేస్తున్న నేపథ్యంలో మేయర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో పరిస్థితి అదుపు తప్పినట్లు మేయర్ జిమ్ వాట్సన్ ప్రకటించారు. పోలీసుల సంఖ్య కన్నా.. ఆందోళనకారుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. నిరసనకారులతో ప్రజల భద్రత, రక్షణకు సమస్య ఏర్పడినట్లు ఆయన చెప్పారు. గత వారం రోజుల నుంచి ఒట్టావోలో ప్రదర్శనలు వెల్లువెత్తుతున్నాయి. వాహనాలను నగరంలో ఎక్కడికక్కడ పార్క్ చేశారు. టెంట్లు వేసి మరీ రోడ్లను మూసివేశారు. కోవిడ్ టీకా వేసుకున్న వాళ్లే డ్రైవింగ్ చేయాలంటూ విధించిన ఆంక్షలను డ్రైవర్లు వ్యతిరేకిస్తున్నారు. ఫ్రీడమ్ కాన్వాయ్ పేరుతో ఆందోళనకారులు ప్రదర్శన చేపట్టారు.