హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): అంతరించిపోతున్న గిరిజన సంస్కృతి, ఉనికిని కాపాడుకోవడానికి గిరిజన సంఘాల నేతలు ముందుకు రావాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధర్మనాయక్ అధ్యక్షతన జరిగిన గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన ఠానూ నాయక్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, బంజారాలు మాట్లాడే ‘గోర్ బోలి’ లిపిని రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని కోరారు. అక్టోబర్ 10,11 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించే నంగారా ఉత్సవాలకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికలకు ముందు ‘చేవెళ్ల డిక్లరేషన్’ పేరుతో గిరిజనులకు ఇచ్చిన 12 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదని ధ్వజమెత్తారు.