నెల రోజులుగా క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన టీ20 ప్రపంచకప్ చివరి అంకానికి చేరింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమ్ఇండియా లీగ్ దశలోనే ఇంటి బాటపట్టగా.. అనూహ్య విజయాలతో అజేయంగా సెమీస్‌కు చేరిన పాకిస్థాన్ అక్కడితోనే పోరాటం ముగించింది. కప్పు కొట్టడం ఖాయమనుకున్న ఇంగ్లండ్ సెమీఫైనల్లో కివీస్ చేతిలో భంగపడగా.. డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.
పెద్దగా అంచనాల్లేకుండానే బరిలోకి దిగి అద్భుత ప్రదర్శనతో దూసుకొచ్చిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆఖరి పోరులో అమీతుమీకి సిద్ధమయ్యాయి. వన్డే ఫార్మాట్లో ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆసీస్.. టీ20ల్లో తొలి టైటిల్ పట్టాలని ఉవ్విళ్లూరుతుంటే.. పొట్టి ఫార్మాట్లో తొలిసారి తుదిపోరుకు చేరిన కివీస్ కప్పు ఎగరేసుకుపోవాలని కసిగా ఉంది. ఉత్కంఠభరిత సెమీఫైనల్స్‌తో భారీ అంచనాలు ఏర్పడ్డ గాటోర్నీలో అదే స్థాయి
ఫైనల్ టచ్ కోసం యావత్ ప్రపంచంఎదురుచూస్తున్నది! మరింకెందుకు ఆలస్యం సండే బిగ్ ఫైట్ కోసం మీరూ సిద్ధమైపోండి..!
దుబాయ్: సమ ఉజ్జీలైన రెండు జట్ల మధ్య మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. పొట్టి ప్రపంచకప్‌లో తొలి కప్పు కొట్టాలనే తపన ఒకరిదైతే.. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తూ ఐసీసీ టోర్నీల్లో దుమ్మురేపుతున్న రికార్డు మరొకరిది. కరోనా కష్టకాలంలో కఠినమైన బయో బబుల్ నిబంధనల మధ్య నెల రోజులుగా సాగుతున్న విశ్వసమరానికి ఆదివారంతో తెరపడనుంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగనున్న ఫైనల్ ఫైట్‌లో కొత్త చాంపియన్ అవతరించనుంది. లీగ్ దశలో ఒక్కో మ్యాచ్ ఓడిన ఇరు జట్లు.. సెమీఫైనల్స్‌లో అద్వితీయ ప్రదర్శన కనబర్చి తుదిపోరుకు అర్హత సాధించడంతో టోర్నీపై అంచనాలు రెట్టింపయ్యాయి. తొలి సెమీఫైనల్లో హాట్ ఫేవరెట్ ఇంగ్లండ్‌కు న్యూజిలాండ్ చుక్కలు చూపితే.. రెండో సెమీస్‌లో కంగారూల జట్టు ఫుల్ జోష్‌లో ఉన్న పాకిస్థాన్‌ను నేలకు దించింది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ ఆరంభంలో వెనుకబడిపోయిన కివీస్, ఆసీస్ చివరి నాలుగు ఓవర్లలో అదరగొట్టాయి. పెద్ద మ్యాచ్‌ల్లో ఒత్తిడిని జయించడం అలవాటు చేసుకుంటున్న విలియమ్సన్ సేన.. ఇంగ్లండ్‌కు ఇంటి దారి చూపితే.. వరుస విజయాలతో విజృంభించిన పాకిస్థాన్‌కు ఆసీస్ గట్టి స్ట్రోక్ ఇచ్చింది. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆసీస్‌పై ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విజయం సాధించని న్యూజిలాండ్ చరిత్ర తిరగ రాయాలని కంకణం కట్టుకుంటే.. 2015 వన్డే ప్రపంచకప్ తర్వాత తొలిసారి ఐసీసీ ఫైనల్ చేరిన ఆసీస్.. టైటిల్ కొట్టి కంగారూ క్రికెట్‌కు పూర్వ వైభవం తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉంది. ఆస్ట్రేలియా సెమీస్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతుండగా.. కోపంలో చేతిని గాయ పరుచుకున్న కాన్వే స్థానంలో సీఫర్ట్ కివీస్ వికెట్ కీపింగ్ బాధ్యతలు మోయనున్నాడు. వార్నర్, ఫించ్, స్మిత్, మ్యాక్స్‌వెల్, మార్ష్, వేడ్, స్టొయినిస్‌తో కూడిన ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను బౌల్ట్, సౌథీ, నీషమ్, సోధి, శాంట్నర్‌ల కివీస్ బౌలింగ్ బలగం ఎలా అడ్డుకుంటుందనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉన్నది.
వీళ్లే కీలకం..
అంచనాల్లేకుండా తుదిపోరుకు అర్హత సాధించిన ఇరు జట్లలోనూ మ్యాచ్ విన్నర్లకు కొదవ లేకున్నా.. ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో ఒత్తిడిని జయించడం బాగా అలవాటైన ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను కివీస్ బౌలర్లు ఎలా నిలువరిస్తారనేది ఆసక్తి రేపుతున్నది. ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీతో పాటు తుది జట్టులో చోటు కోల్పోయిన డేవిడ్ వార్నర్ ఆ కసినంతా ఈ టోర్నీలో కనబరుస్తున్నాడు. మరో ఓపెనర్ ఫించ్ వరుసగా విఫలమవుతున్నా.. ఆ ప్రభావం జట్టు మీద పడలేదంటే అందుకు వార్నర్ దూకుడే కారణం. ఇప్పటి వరకు టోర్నీలో 148.42 స్ట్రయిక్ రేట్‌తో 236 పరుగులు చేసిన డేవిడ్ భాయ్ అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. అతడితో పాటు పాక్‌తో సెమీస్‌లో వీరవిహారం చేసిన స్టొయినిస్, మాథ్యూ వేడ్ మరోసారి కీలకం కానుండగా.. స్మిత్ మునుపటి జోరు కనబర్చాలని చూస్తున్నాడు. కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ఈ టోర్నీలో బ్యాట్‌తో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. వనరులను సమర్థవంతంగా వినియోగించడంలో కేన్ విజయవంతమయ్యాడు. గప్టిల్, మిచెల్, నీషమ్‌పై కివీస్ బ్యాటింగ్ ఎక్కువగా ఆధారపడి ఉంది. టోర్నీలోనే అత్యుత్తమ పేస్ దళం అందుబాటులో ఉండటం న్యూజిలాండ్‌కు కలిసొచ్చే అంశం కాగా.. శాంట్నర్, సోధి రూపంలో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు ఉండటం అదనపు బలం.
పడిగాపులు కాయాల్సిందే..
తమ జాతీయ జట్లు ప్రపంచకప్ ఫైనల్లో తలపడుతుంటే.. ఆ మ్యాచ్ చూసేందుకు స్వదేశంలో అభిమానులంతా కాలంతో కుస్తీ పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. భారత కాలమానం ప్రకారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఫైనల్ ప్రారంభం కానుండగా.. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో అర్ధరాత్రి ఒంటిగంటా.. న్యూజిలాండ్‌లో సోమవారం తెల్లవారుజామను 3 గంటల సమయం అవుతుండటమే దీనికి ప్రధాన కారణం.
కష్టానికి దక్కిన ఫలితమిది. ప్రపంచకప్ ఫైనల్‌ను కూడా మరో మ్యాచ్‌లాగే చూస్తాం. మా జట్టు మంచి లయలో ఉంది. ఆదివారం దాన్ని కొనసాగించేందుకు
ప్రయత్నిస్తాం.
ఇది అనుకోకుండా
జరిగిందేం కాదు. కప్పు కొట్టాలనే పక్కా ప్రణాళికతోనే ఇక్కడికి వచ్చాం. మా ఆటగాళ్లకు ఆ సత్తా ఉంది. ఫైనల్లో దాన్ని కొనసాగించి విజేతగా నిలుస్తాం. బౌల్ట్, సౌథీ నుంచి ఆరంభంలో ఇబ్బంది ఎదురుకావొచ్చు. అందుకు మేం సిద్ధంగా ఉన్నాం.
తుది జట్లు (అంచనా)
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, మార్ష్, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, వేడ్, కమిన్స్, స్టార్క్, జంపా, హజిల్‌వుడ్.న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మిచెల్, సీఫెర్ట్, ఫిలిప్స్, నీషమ్, శాంట్నర్,
సౌథీ, మిల్నే, బౌల్ట్, సోధి.
పిచ్, వాతావరణం
పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ జరిగిన దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలోనే ఫైనల్ సాగనుంది. మంచు ప్రభావం ఉండనుండటంతో మరోసారి టాస్ కీలకం కానుంది.
ఫైనల్ టైమింగ్స్
దుబాయ్ సాయంత్రం గం. 6.00
భారత్ రాత్రి గం. 7.30
ఆస్ట్రేలియా అర్ధరాత్రి గం. 1.00
న్యూజిలాండ్ సోమవారం ఉ. 3.00