తెలుగు తెరకు వచ్చిన మరో బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్. వరుణ్ తేజ్ సరసన ఆమె ‘గని’ చిత్రంలో నాయికగా నటిస్తున్నది. ఈ సినిమాను నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించారు. సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదలవుతున్నది. ఈ సందర్భంగా సినిమాలో నటించిన అనుభవాలను పంచుకుంది ఆమె. సయీ మంజ్రేకర్ మాట్లాడుతూ…‘మూడేళ్ల క్రితం దర్శకుడు కిరణ్ నాకు ఈ కథ చెప్పారు. వినగానే నచ్చింది. రెండు నెలల తర్వాత మూవీ పనులు మొదలయ్యాయి. మా నాన్న మహేష్ మంజ్రేకర్ నటుడిగా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం. ఆయనకు దర్శకుడిగానూ మంచి పేరుంది. ఆయన వారసురాలిగా తెలుగులో నటిస్తున్నప్పుడు బాధ్యతగా భావించాను. తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి మొదటి షెడ్యూల్ వరకు ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత అలవాటైంది. వరుణ్ తేజ్ పూర్తి సహకారం అందించారు. ఈ సినిమా వరకు నాకు ఎదురైన అతిపెద్ద సవాలు భాష. తెలుగు భాష తెలియదు కాబట్టి ఏదైనా సందేహం వస్తే వరుణ్ దగ్గరకే వెళ్లేదాన్ని. అందుకు వరుణ్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. ఈ చిత్రంలో మాయ అనే క్యారెక్టర్లో కనిపిస్తాను. నాకు ఇష్టమైన పాత్ర ఇది. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. చిన్నప్పటి నుంచి టీవీలో తెలుగు డబ్బింగ్ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. ఓటీటీలు వచ్చాక తెలుగు సినిమా నటీనటులు గురించి పూర్తిగా తెలిసింది. నేను విధిని ఎక్కువగా నమ్ముతాను. సినిమా వాయిదాలు పడిన సమయంలోనూ అదే ఆలోచనతో ఉన్నా. సినిమా వాస్తవంగా ఏ సమయానికి విడుదల కావాలో అప్పుడే అవుతుందని అనుకున్నా. నేను నటించిన ‘గని’, ‘మేజర్’ చిత్రాలు వరుసగా విడుదలకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ రెండు చిత్రాలు పరస్పరం భిన్నమైనవి కావడం నటిగా గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నా. ఇప్పటిదాకా నేనూ ఈ సినిమా చూడలేదు. మా చిత్రబృందం, కుటుంబ సభ్యులు, ప్రేక్షకులతో పాటే చూడబోతున్నా. తెలుగు, బాలీవుడ్ చిత్రాలకు పెద్ద తేడాలేం లేవు. సినిమా కోసం మేమంతా పడే కష్టం అక్కడా ఇక్కడా ఒక్కటే. ఇక్కడి ఆహారం చాలా రుచిగా ఉంటుంది. సెట్లో ఇడ్లీ, దోసె, చికెన్, హైదరాబాదీ బిర్యానీ తింటూ ఆస్వాదించాను. ఇలాంటి పాత్రలే చేయాలని అనుకోవడం లేదు. నటిగా సవాలు విసిరే క్యారెక్టర్స్‌లో నటించాలని ఉంది. పాత్రమేరకు గ్లామర్‌గా నటించేందుకూ సిద్ధమే. వెబ్ సిరీస్‌లూ ఇష్టమే గానీ నటిగా నన్ను నేను తెరపై చూసుకోవడానికే ప్రాధాన్యమిస్తాను. ఎందుకంటే అలా వెండితెరపై నటీనటులను చూసే నేనూ నటిగా మారాలనుకున్నా. రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో నటించాలని కోరుకుంటున్నా. ప్రస్తుతానికి మరే తెలుగు, బాలీవుడ్ చిత్రాలను అంగీకరించలేదు ’ అని చెప్పింది.