“రాజా విక్రమార్క’ చిత్రంలో సంప్రదాయ నృత్యకారిణిగా అభినయానికి ఆస్కారమున్న పాత్రలో కనిపిస్తా’నని చెప్పింది తాన్య రవిచంద్రన్. ఆమె కథానాయికగా తెలుగు చిత్రసీమకు పరిచయమవుతున్న చిత్రం ‘రాజా విక్రమార్క’. కార్తికేయ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ సరిపల్లి దర్శకుడు. 88 రామారెడ్డి నిర్మించారు. ఈ నెల 12న విడుదలకానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో తాన్య రవిచంద్రన్ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి..
కథానాయికగా తెలుగులో నా తొలి సినిమా ఇది. ఇందులో కాంతి అనే అమ్మాయిగా నా పాత్ర సహజంగా సాగుతుంది. హోమ్ మినిస్టర్ కూతురు అయినా సామాన్య జీవితాన్ని గడపాలని తపిస్తుంటుంది. క్లాసికల్ డ్యాన్సర్‌గా గొప్ప పేరుతెచ్చుకోవాలని అనుకున్న ఆమె జీవితంలో ఓ ఎన్ఐఏ ఏజెంట్ ఎలా ప్రవేశించాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. పదిహేనేళ్లుగా నేను భరతనాట్యం నేర్చుకుంటున్నా. డ్యాన్స్ తెలియడంతో పాత్రలో ఒదిగిపోవడం సులభమైంది. నా రియల్‌లైఫ్‌కు ఈ పాత్రతో కొన్ని పోలికలున్నాయి. కమర్షియల్ సినిమాల్లో మాదిరిగా పాటలు, కొన్ని సన్నివేశాలకే పరిమితం కాకుండా సినిమా మొత్తం నేను కనిపిస్తా. కార్తికేయ నటనలో సహజత్వం నచ్చుతుంది. అందరితో స్నేహంగా ఉంటాడు.
మా తాతయ్య రవిచంద్రన్ తమిళంలో గొప్ప నటుడిగా పేరుతెచుకున్నారు. కష్టపడేతత్వం, అంకితభావం, క్రమశిక్షణకు ఎక్కువ విలువనిచ్చేవారు. తాతయ్య నుంచి ఆ లక్షణాల్ని అలవర్చుకున్నా. నేను సినిమాల్లో నటించే సమయానికి ఆయన మరణించడం నన్ను ఎంతో బాధపెట్టింది. ఇప్పుడు ఆయన ఉండుంటే నటుడిగా నాకు వస్తోన్న అవకాశాలు చూసి ఎంతో సంతోషించేవారు. పీజీ చేస్తూనే తమిళంలో మూడు సినిమాల్లో నటించా. నా పాత్రకు ప్రాధాన్యముందనిపిస్తే కమర్షియల్ సినిమాల్ని కూడా అంగీకరిస్తా.