ప్రస్తుతం మంచి స్నేహబంధాన్ని పంచుకుంటున్న సుష్మితా సేన్, సల్మాన్ ఖాన్ తొలి పరిచయం మాత్రం అంత సాఫీగా జరగలేదు. ‘బీవీ నెం.1’ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఈ సంఘటనను సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. షూటింగ్ మొదటి రోజున ఆయన ఉదయం 11 గంటలకు సెట్స్‌కు చేరుకున్నాడు. అయితే సుష్మితా సేన్ ఉదయం 9 గంటల నుంచే అక్కడ వేచి ఉందట. ఆమెను చూడగానే సల్మాన్ ‘హాయ్ సుష్, ఎలా ఉన్నావు? నేను సల్మాన్’ అని పలకరించాడట. అయితే, సుష్మిత మాత్రం జస్ట్ చేతులు కలిపి, పెద్దగా స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిందట.
ఆమె స్పందన చూసి ఆశ్చర్యపోయిన సల్మాన్, దర్శకుడు డేవిడ్ ధవన్ దగ్గరికి వెళ్లి, ‘ఆమెకు ఏమైంది? ఎందుకిలా యాటిట్యూడ్ చూపిస్తున్నది?’ అని అడిగాడట. కొన్నాళ్లకు తామిద్దరి మధ్యా అపార్థాలు తొలగిపోయి, మంచి స్నేహితులం అయ్యామని చెప్పుకొచ్చాడు సల్మాన్. తర్వాత వీరిద్దరూ కలిసి పలు చిత్రాల్లో కలిసి నటించారు. ఈ సంఘటనను ఇద్దరూ సరదా జ్ఞాపకంగా గుర్తుచేసుకుంటుంటారు. తొలి పరిచయంలో చిన్న అపార్థం తలెత్తినప్పటికీ, తర్వాత సుష్మితాను సల్మాన్ తెగ ప్రశంసించాడు. ప్రముఖ నటుడు ఫారూఖీ షేక్ నిర్వహించిన ‘జీనా ఇసీ కా నామ్ హై’ కార్యక్రమంలో సల్మాన్ ఈ సంగతులన్నీ పంచుకున్నాడు.