ఐపీఎల్లో సన్‌రైజర్స్ జైత్రయాత్ర కొనసాగుతున్నది! తొలి రెండు పరాజయాల తర్వాత పట్టాలెక్కిన హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ దుమ్మురేపింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో బెంగళూరును 68 పరుగులకే ఆలౌట్ చేసిన రైజర్స్.. ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో రన్‌రేట్‌ను మరింత మెరుగుపర్చుకున్న హైదరాబాద్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా.. విరాట్ కోహ్లీ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఎదుర్కొన్న తొలి బంతికే ఔటై.. అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు!
ముంబై: పటిష్టమైన బ్యాటింగ్ దళానికి.. పదునైన బౌలింగ్ బలగానికి మధ్య జరిగిన పోరులో బంతిదే పైచేయి అయింది. రైజర్స్ బౌలర్లు ఒకరిని మించి మరొకరు చెలరేగడంతో ఐపీఎల్ 15వ సీజన్లో హైదరాబాద్ వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం జరిగిన రెండో పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 9 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకు ఆలౌటైంది.
సుయాశ్ ప్రభుదేశాయ్ (15), మ్యాక్స్‌వెల్ (12) మాత్రమే రెండంకెల స్కోర్లు నమోదు చేయగా.. డుప్లెసిస్ (5), విరాట్ కోహ్లీ (0), అనూజ్ రావత్ (0), షాబాజ్ అహ్మద్ (7), దినేశ్ కార్తీక్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టిన మార్కో జెన్సెన్ (3/25).. బెంగళూరును భారీ దెబ్బ కొట్టాడు. ఇక ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయిన బెంగళూరు.. లీగ్‌లో తమ రెండో అత్యల్ప స్కోరు నమోదు చేసుకుంది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో హైదరాబాద్ 8 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 72 పరుగులు చేసింది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టగా.. కెప్టెన్ విలియమ్సన్ (16 నాటౌట్) అండగా నిలిచాడు. జాన్సెన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ప్రపంచ అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు సాధించిన మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజా సీజన్లో పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. లక్నోతో పోరులో ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగిన విరాట్.. తాజా మ్యాచ్‌లోనూ అదే తప్పిదం పునరావృతం చేశాడు. ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి స్లిప్‌లో మార్క్మ్క్రు క్యాచ్ ఇచ్చి నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. సాధారణంగా క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకునే విరాట్.. గత రెండు మ్యాచ్‌లుగా వచ్చిన తొలి బంతినే వెంటాడి ఔటవుతుండటం గమనార్హం.
పని భారాన్ని దృష్టిలో పెట్టుకొని సీజన్ ఆరంభానికి ముందే టీమ్ఇండియాతో పాటు, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్.. ఈసారి ఆటగాడిగా జోరు కనబరుస్తాడనుకుంటే.. నానాటికి తీసికట్టు ఆటతో అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో కోహ్లీ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోవడమే మంచిదన్న మాజీ కోచ్ రవిశాస్త్రి మాటలపై చర్చ జోరందుకుంది.
2ఐపీఎల్లో బెంగళూరుకు ఇది (68) రెండో అత్యల్ప స్కోరు. 2017లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 49 పరుగులకే ఆలౌటైంది.
6ఓవరాల్‌గా ఐపీఎల్లో ఇది ఆరో అత్యల్ప స్కోరు. ఈ జాబితాలో బెంగళూరు (49, 68), రాజస్థాన్ (58), ఢిల్లీ (66, 67), కోల్‌కతా (67) ఉన్నాయి.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 16.1 ఓవర్లలో 68 ఆలౌట్ (ప్రభుదేశాయ్ 15; నటరాజన్ 3/10, జాన్సెన్ 3/25), హైదరాబాద్: 8 ఓవర్లలో 72/1 (అభిషేక్ శర్మ 47, విలియమ్సన్ 16 నాటౌట్).