‘నా పన్నెండేళ్ల సినీ ప్రయాణంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం. హాకీ నేపథ్యంలో తీసిన మాస్ ఎంటర్టైనర్ ఇది. దేశభక్తి కలబోసిన హాకీని అందరూ ఆదరిస్తారు. ఈ సినిమా అవుట్‌పుట్ చూసుకున్నాక మా అందరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి’ అన్నారు సందీప్‌కిషన్. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్‌కిషన్, దయా పన్నెం నిర్మాతలు. నేడు విడుదలకానుంది. సందీప్‌కిషన్ మాట్లాడుతూ సినిమా ద్వారా వచ్చే లాభాల్ని పిల్లల చదువులకు ఉపయోగిస్తానని చెప్పారు. ‘కొత్తతరం క్రీడానేపథ్య చిత్రమిది. ప్రతిభను తప్పకుండా ప్రోత్సహించాలనే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించాం. ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచుతుంది’ అని దర్శకుడు తెలిపారు. తెలంగాణ, ఏపీతో పాటు ఓవర్సీస్లో కూడా భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివేక్ కూచిభొట్ల, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ తదితరులు పాల్గొన్నారు.