సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు గాస్సిప్స్ కూడా కామన్. నేమ్ ఫేమ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు తమపై వచ్చే గాసిప్స్ కూడా ఎంజాయ్ చేయాల్సిందే. వేరే ఆప్షన్ లేదు. తాజాగా ఇప్పుడు ఒక సీనియర్ కమెడియన్ తన కెరీర్లో జరిగిన ఒక విషయం గురించి మీడియా ముందు చెప్పాడు. ఆయన ఎవరో కాదు సుధాకర్. ఒకప్పుడు చిరంజీవి రూమ్ మేట్ ఈయన. అందరూ కలిసి ఒకేసారి ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరారు. అయితే అందులో అందరికంటే ముందు సుధాకర్ హీరో అయ్యాడు. కానీ తెలుగులో కాదు తమిళంలో. 1975-76 ప్రాంతంలోనే ఈయనకు హీరోగా అవకాశం వచ్చింది. అక్కడ వరుసగా దాదాపు 40 సినిమాలు చేశాడు.
సూపర్ స్టార్ ఇమేజ్ కూడా సొంతం చేసుకున్నాడు సుధాకర్. కానీ తమిళనాట జరిగిన కొన్ని రాజకీయాల వలన ఆయన అక్కడి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈయన నటించిన 40 సినిమాలలో 18 సీనియర్ హీరోయిన్ రాధికతో కలిసి నటించాడు. అప్పట్లో వీళ్ళద్దరిదీ సెన్సేషనల్ జోడి. దాంతో సుధాకర్, రాధిక మధ్య ఎఫైర్ ఉందని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని.. అందుకే అన్ని సినిమాల్లో కలిసి నటిస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. పైగా అప్పుడు ఇప్పుడు ఉన్నంత మీడియా లేదు. దాంతో అది నిజమే అనుకున్నారు జనాలు కూడా. అన్నింటికీ మించి వీళ్ళు ఇద్దరు తమపై వస్తున్న వార్తలను ఖండించకపోవడం కూడా అగ్నికి వాయువు తోడైనట్లు అయింది. కానీ ఆ తర్వాత సుధాకర్, రాధిక మధ్య ఏదో గొడవ వచ్చి మళ్లీ కలిసి సినిమా చేయలేదు.
ఇదిలా ఉంటే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికతో తనకున్న అనుబంధం గురించి బయటపడ్డాడు సుధాకర్. అప్పట్లో తమ ఇద్దరి మధ్య ఎఫైర్ కొనసాగిందంటూ వచ్చిన వార్తలను పట్టించుకోలేదని.. అవన్నీ అబద్ధాలే అంటూ కొట్టి పారేశాడు. తనకు 1983లో పెళ్లయిందని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నాను అని చెప్పాడు సుధాకర్. కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంటే చెడు అలవాట్లు ఉంటాయి అని అప్పట్లో దుష్ప్రచారం జరిగేదని.. అలా తనపై కూడా కొన్ని తప్పుడు వార్తలు వచ్చాయని చెప్పుకొచ్చాడు. అంతే కానీ తనకు రాధిక మధ్య ఎలాంటి సంబంధం లేదు అంటూ ఓపెన్ అయిపోయాడు సుధాకర్. తమిళ ఇండస్ట్రీలో మీరు ఎందుకు నిలదొక్కుకోలేకపోయారు అంటే అక్కడ కొందరు కావాలనే రాజకీయాలు చేసి తన కెరీర్ నాశనం చేశారని చెప్పుకొచ్చాడు సుధాకర్.