హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని బడులు సోమవారం పునఃప్రారంభమయ్యాయి. పలు బడుల్లో తొలిరోజు విద్యార్థుల హాజరు గణనీయంగా తగ్గింది. 20%లోపు మాత్రమే హాజరైన ట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అమావాస్య ఎఫెక్ట్‌తో కొందరు తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపించేందుకు విముఖత చూపారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలైతే తాళాలు కూడా తీయకపోవడం గమనార్హం. తెరిచిన బడుల్లో విద్యార్థుల హాజరు అంతంత మాత్రంగానే నమోదైంది. నారాయణపేట జిల్లాలోని ఒక స్కూల్లో ఒక్కరు కూడా రాలేదు. డోర్నకల్ దగ్గరున్న ఓ స్కూల్లో 15 మంది టీచర్లు హాజరు కాగా, ఇద్దరు విద్యార్థులు మాత్రమే బడికి వచ్చారు.
సర్కార్ బడుల్లో అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) తొలి రోజు మొరాయించింది. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు తీవ్రంగా ఇబ్బందిపెట్టింది. ఓ టీచర్ ఉదయమే ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో అటెండెన్స్ నమోదు చేసినా, గైర్హాజరు అని చూపిస్తున్నది. మరో టీచర్‌కు సందేహం తలెత్తగా, ఐదారుసార్లు హాజరు నమోదు చేయాల్సి వచ్చింది. కొన్ని బడుల్లో విద్యార్థుల తరగతి అప్‌గ్రేడ్ కాలేదు. పాత తరగతే చూపించడంతో గందరగోళం నెలకొన్నది. కాగా సర్కార్ బడుల్లో విద్యార్థులకు అందించే బ్రేక్‌ఫాస్ట్ పథకం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. 27వేల బడులు, 460 జూనియర్ కాలేజీలుండగా, కేవలం 1,302 బడులు, 33 జూనియర్ కాలేజీల్లోనే ప్రారంభించారు. విద్యార్థుల హాజరు తక్కువగా ఉండటంతో బ్రేక్‌ఫాస్ట్ వృథా అయ్యింది. ఒక స్కూల్లో దోశలు అందించారు. అయితే విద్యార్థులు గైర్హాజరు కావడంతో దోశలు వృథా అయ్యాయి.