హైదరాబాద్: లెజెండ్ అంటే సెరీనా. సెరీనా అన్నా లెజెండే. వుమెన్ టెన్నిస్‌లో నేటి తరం సూపర్‌స్టార్. అమెరికన్ టెన్నిస్ దిగ్గజం సెరీనా విలియమ్స్ తన కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసింది. ఇవాళ జరిగిన యూఎస్ ఓపెన్ మూడవ రౌండ్ మ్యాచ్‌లో ఓడిన సెరీనా తన సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పినట్లు తెలుస్తోంది. 27 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో సెరీనా మొత్తం 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు గెలుచుకున్నది. యూఎస్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీల్లో తన సత్తా చాటుకున్నది. మహిళ టెన్నిస్‌లో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ ఘనతను సెరీనా సొంతం చేసుకున్నది.
మాజీ నంబర్ వన్ ప్లేయర్ సెరీనా.. యూఎస్ ఓపెన్ తన కెరీర్లో చివరి టోర్నీ అవుతుందని ముందే ప్రకటించింది. దీంతో ఈ టోర్నీపై అందరి ఆసక్తి నెలకొన్నది. వచ్చే నెలలో 41వ పడిలోకి వెళ్లనున్న సెరీనా.. ఇంత సుదీర్ఘ కాలం టెన్నిస్ ఆడడం గొప్ప విషయమే. సెరీనా పేరిట మొత్తం 39 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు ఉన్నాయి. దాంట్లో 23 సింగిల్స్, 14 డబుల్స్, రెండు మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. గడిచిన 30 ఏళ్లలో ఇంత పవర్ఫుల్ వుమెన్ ప్లేయర్ లేరన్న విషయం తన రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.
14 ఏళ్ల వయసులో 1995లో తొలిసారి ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడింది సెరీనా. పేరెంట్స్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె టెన్నిస్‌లో మేటి ప్లేయర్‌గా ఎదిగింది. ఒక అమెరికన్ ప్లేయర్‌గా మాత్రమే కాదు.. క్రీడాలోకంలో సెరీనా ఓ స్టార్ స్టేటస్‌ను సంపాదించుకున్నది. రిటైర్ అవుతున్నట్లు సెరీనా ఎక్కడా నేరుగా ప్రకటించకపోయినా.. తన కెరీర్‌ను స్వంత దేశంలోనే వైభవంగా ముగించాలని భావించింది. క్వీన్ ఆఫ్ క్వీన్స్‌గా సెరీనా టెన్నిస్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నది.
సెరీనా తన తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను 17 ఏళ్లకే గెలుచుకున్నది. ఇక వింబుల్డన్‌లో 11 సార్లు ఆమె ఫైనల్స్‌కు చేరుకున్నది. గంటకు 128.6 కిలోమీటర్ల వేగంతో ఓ సారి ఫాస్టెస్ట్ సర్వ్ చేసిందామె. సెరీనా ఇప్పటి వరకు 73 సింగిల్స్ టైటిళ్లను సొంతం చేసుకున్నది. హార్డ్ కోర్ట్‌లో 47, క్లే కోర్ట్‌లో 13, గ్రాస్ కోర్ట్‌లో 8, కార్పెట్ కోర్టులో 5 టైటిళ్లను ఎగురేసుకుపోయింది. సెరీనా తన కెరీర్లో 319 వారాల పాటు వరల్డ్ నెంబర్ వన్‌గా కొనసాగింది. విలియమ్స్ పతకాల పట్టీలో నాలుగు ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ కూడా ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ సెరీనాకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఫేస్బుక్లో 7.4 మిలియన్లు, ట్విట్టర్లో 10.7 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 15.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఈ యేటి యూఎస్ ఓపెన్ తన కెరీర్లో చివరి టోర్నీ అవుతుందని గతంలో సెరీనా చెప్పినా.. మ్యాచ్ ఓటమి తర్వాత మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే సెరీనా తన ఫేర్వెల్ మ్యాచ్ ఆడేసి ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఇక సెరీనా ఘనతలను కీర్తిస్తూ కొందరు ట్వీట్లు చేశారు. సెరీనా లెజెండ్.. సెరీనా చాంపియన్ అంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓప్రా విన్ఫ్రే తన ట్వీట్లో సెరీనాను ఎప్పటికే లెజెండ్ అని కామెంట్ చేశారు. అమెరికా మాజీ తొలి ప్రథమ పౌరురాలు మిచెల్ ఒబామా తన ట్వీట్లో సెరీనాకు కంగ్రాట్స్ తెలిపారు.