ముంబై, ఫిబ్రవరి 23: అమ్మాయికి ఒకసారి ‘ఐ లవ్ యూ’ చెప్పినంత మాత్రాన లైంగిక వేధింపుగా పరిగణించలేమని ముంబైలోని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. మహా అయితే అది ప్రేమ వ్యక్తీకరణ కిందకు వస్తుందని స్పెషల్ జడ్జి కల్పనా పాటిల్ పేర్కొన్నారు. పోక్సో చట్టం కింద అరెస్టు చేసిన 23 సంవత్సరాల యువకుడిని నిర్దోషిగా ప్రకటించారు. 2016లో ఈ ఘటన జరిగింది. నిందితుడు ఒకరోజు అమ్మాయి ఇంటికి వెళ్లి ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. ఆ తర్వాత వెంటపడడంగానీ, అమ్మాయిని ఇబ్బంది పెట్టడం గానీ చేయలేదు. తల్లిదండ్రులను బెదిరించినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపించినప్పటికీ అమ్మాయి గౌరవానికి భంగకరమైన పని ఏదైనా చేసినట్టు రుజువు చేయలేకపోయారని జడ్జి అన్నారు.