అగ్ర కథానాయిక సమంత తన సినీ జీవితంలో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నది. దక్షిణాదిలో తిరుగులేని పాపులారిటీ సంపాదించుకున్న ఈ భామ ‘ఫ్యామిలీ మెన్-2’ సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడీ సుందరి అంతర్జాతీయ యవనికపై మెరవనుంది. సమంత హాలీవుడ్లో అరంగేట్రం చేస్తూ ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ అనే చిత్రంలో నటించనుంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఫిలిప్‌జాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా విశేషాలను తెలియజేస్తూ సమంత ఓ ట్వీట్ చేసింది.‘ఇదొక సరికొత్త ప్రపంచం. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉంది. హాలీవుడ్లో అడుగుపెట్టడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొంది. ఈ సినిమాలో ఆమె బై సెక్సువల్‌గా కనిపించనున్నట్లు సమాచారం. భారత రచయిత తిమేరి ఎన్ మురారీ రచించిన ‘అరెంజ్మెంట్స్ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం సమంత ఆడిషన్స్‌లో పాల్గొనడం విశేషం. తొలి చిత్రం ‘ఏ మాయ చేసావే’ సమయంలో ఆడిషన్స్‌లో పాల్గొన్నానని, సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఆడిషన్స్ ద్వారా సినిమాకు ఎంపిక కావడం సరికొత్త అనుభవమని సమంత చెప్పింది.