రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) అదరగొట్టింది. తాము మనసు పెట్టి ఆడితే ప్రత్యర్థి ఎవరైనా బలాదూర్ అన్నట్లు విజృంభించింది. వరుణుడు అంతరాయం కారణంగా ఆలస్యంగా మొదలైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌పై ఆర్సీబీ అద్భుత విజయం సొంతం చేసుకుంది. తొలుత రజత్ పాటీదార్ ధనాధన్ సెంచరీతో కదంతొక్కితే హాజిల్‌వుడ్ లక్నో జోరుకు బ్రేక్‌లు వేశాడు. హిట్టర్లు విఫలమైన వేళ పాటీదార్..ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారించాడు. లక్నో బౌలర్లను చీల్చిచెండాడుతూ భారీ సెంచరీతో విరుచుకుపడ్డాడు. భారీ లక్ష్యఛేదనలో లక్నో పోరాటపటిమ కనబరిచినా..గెలుపు వాకిట బొక్కాబోర్లా పడింది. రాహుల్ నాయకునిలా ముందుండి నడిపించినా..సహచరుల వైఫల్యం లక్నో కొంప ముంచింది. క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌తో బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది.
కోల్‌కతా: ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్ ఎలిమినేట్ అయ్యింది. బుధవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో లక్నోపై అద్భుత విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యఛేదనలో లక్నో 193/6 స్కోరు చేసింది. రాహుల్(79), దీపక్ హుడా(45) రాణించారు. హాజిల్‌వుడ్(3/43) ఆకట్టుకున్నాడు. తొలుత రజత్ పాటీదార్(54 బంతుల్లో 112 నాటౌట్, 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) సూపర్ సెంచరీతో విజృంభించాడు. ఆఖర్లో దినేశ్ కార్తీక్(37నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మోసిన్‌ఖాన్, కృనాల్ పాండ్యా, అవేశ్‌ఖాన్, బిష్ణోయ్‌కు ఒక్కో వికెట్ దక్కింది. సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించిన పాటీదార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
లక్నో దీటుగా:
బెంగళూరు నిర్దేశించిన 208 పరుగుల లక్ష్యఛేదనలో లక్నో దీటుగా జవాబిచ్చే ప్రయత్నం చేసింది. ఓపెనర్ డికాక్(6) నిరాశపర్చగా, కెప్టెన్ కేఎల్ రాహుల్(79) తుదికంటా పోరాడాడు. మనన్ వోహ్రా(19) ఆకట్టుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో షాబాజ్ అహ్మద్ క్యాచ్‌తో వోహ్రా రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రాహుల్, దీపక్ హుడా(45) ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశారు. వీరిద్దరు అడపాదడపా బౌండరీలు కొడుతూ లక్ష్యాన్ని అంతకంతకూ కరిగించే ప్రయత్నం చేశారు. అయితే బారీ షాట్ ఆడే క్రమంలో మార్కస్ స్టోయినిస్(9), లెవిస్(2 నాటౌట్), కృనాల్ పాండ్యా(0) పేలవ ప్రదర్శన కనబరిచారు. ఆఖరి వరకు గెలుపు కోసం ప్రయత్నించిన లక్నో ఆశలు నెరవేరకపోగా, 2016 తర్వాత ఆర్సీబీ తొలిసారి ఫైనల్‌కు చేరింది.
పాటీదార్ ధమాకా:
ఆర్సీబీ యువ బ్యాటర్ రజత్ పాటీదార్ దుమ్మురేపాడు. కెప్టెన్ డుప్లెసిస్(0), మ్యాక్స్‌వెల్(9), మహిపాల్ లామ్రోర్(14) లాంటి భారీ హిట్టర్లు ఫ్లాప్ అయిన వేళ తన సత్తా ఏంటో పాటిదార్ చేతల్లో చూపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే డుప్లెసిస్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరుగగా, కోహ్లీ(25) స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. డుప్లెసిస్ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాటీదార్ ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచాడు. అవేశ్‌ఖాన్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది తన ఉద్దేశమేంటో చెప్పకనే చెప్పాడు. ఆ మరుసటి ఓవర్లో కృనాల్ పాండ్యాకు పాటీదార్ చుక్కలు చూపించాడు.
మూడు ఫోర్లు, ఓ భారీ సిక్స్‌తో విరుచుకుపడటంతో పవర్‌ప్లే ముగిసే సరికి ఆర్సీబీ 52/1 స్కోరు చేసింది. అయితే ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో కోహ్లీ.. మోసిన్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రెండో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామానికి బ్రేక్ పడింది. తర్వాత వచ్చిన మ్యాక్స్‌వెల్, లామ్రోర్ వెంట వెంటనే పెవిలియన్ చేరారు. రవి బిష్ణోయ్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లోపాటీదార్ విశ్వరూపం ప్రదర్శించాడు. అప్పటికే అర్ధసెంచరీ పూర్తి చేసుకుని జోరు మీదున్న ఈ యువ బ్యాటర్ 6,4, 6, 4, 6 తో ఏకంగా 27 పరుగులు పిండుకున్నారు. ఓవైపు పాటీదార్ దంచుతుంటే..తానేం తక్కువ కాదంటూ సీనియర్ కార్తీక్ బ్యాటు ఝులిపించడంతో ఆర్సీబీ టాప్ గేర్‌లో దూసుకెళ్లింది. పాటీదార్, కార్తీక్ విజృంభణతో ఆఖరి ఐదు ఓవర్లలో ఆర్సీబీ 84 పరుగులు చేసింది. ముఖ్యంగా పాటీదార్ తన ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు కొల్లగొట్టాడు.
సంక్షిప్త స్కోర్లు
బెంగళూరు: 20 ఓవర్లకు 207/4 (పాటిదార్ 112 నాటౌట్, దినేశ్ కార్తీక్ 37నాటౌట్; మోహిసిన్ ఖాన్ 1/25). లక్నో: 20 ఓవర్లకు 193/6 (రాహుల్ 79, హుడా 45; హాజిల్‌వుడ్ 3/43)