రజనీకాంత్, నయనతార జంటగా నటించిన తమిళ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకుడు. ఈ సినిమాను ఏషియన్ ఇన్ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్పి పతాకంపై నారాయణ్‌దాస్ నారంగ్, సురేష్‌బాబు తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో విడుదలచేస్తున్నారు. కీర్తిసురేష్, మీనా, కుష్భూ కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఇటీవల హీరో వెంకటేష్ విడుదలచేశారు. రజనీకాంత్ శైలి యాక్షన్ ఘట్టాలతో టీజర్ రొమాంచితంగా ఉంది. ‘పల్లెటూరి వాడిని శాంతంగానే చూసుంటావు. కోపంలో చూడలేదు. ఉప్పెన రా..వాడికి అడ్డు లేదు. ఒడ్డు లేదు’ అంటూ టీజర్లో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తున్నది. నిర్మాతలు మాట్లాడుతూ ‘పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. శత్రువులతో సాగించిన సమరంలో పెద్దన్న ఎలా విజయాన్ని సాధించడాన్నది థ్రిల్‌ను కలిగిస్తుంది. మాస్ ప్రేక్షకుల్ని అలరించే అన్ని హంగులుంటాయి. దీపావళి సందర్భంగా నవంబర్4న ఈ సినిమాను విడుదలచేయబోతున్నాం’ అని తెలిపారు. జగపతిబాబు, ప్రకాష్‌రాజ్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇమ్మాన్.