Premikudu | 30ఏళ్ల క్రితం విడుదలైన ప్రభుదేవ ‘ప్రేమికుడు’ సినిమా ఓ సంచలనం. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఏఆర్ రెహమాన్ పాటలు, ప్రభుదేవా నృత్యాలు, శంకర్ దర్శకత్వ ప్రతిభ, కథానాయిక నగ్మా అందచందాలు కుర్రకారుని థియేటర్లకు పరుగులు పెట్టించాయి. మహాగాయకుడు స్వర్గీయ ఎస్పీబాలసుబ్రహ్మమణ్యం ఇందులో ప్రభుదేవ తండ్రిగా ప్రత్యేక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇందులోని పాటలకు ఇప్పటి యువతరం కూడా డ్యాన్సులేస్తుంటారంటే ‘ప్రేమికుడు’ కెపాసిటీ అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ‘ప్రేమికుడు’ త్వరలో రీ రిలీజ్ కానుంది. రమణ, మురళీధర్ ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ కె.ప్రసన్నకుమార్, కోశాధికారి రామసత్యనారాయణ, దర్శకులు ముప్పలనేని శివ, శివనాగు అతిథులుగా హాజరై రీరిలీజ్ కానున్న ‘ప్రేమికుడు’ మళ్లీ ఘన విజయం సాధించి నిర్మాతలకు లాభాల పంట పండించాలని అభిలషించారు.