మేషం: రాశి చక్రంలో ఇది మొదటిది. బేసి, చర, పురుష రాశి. అగ్నితత్వ రాశి. దిశ తూర్పు. చిహ్నం మేక. మేషానికి అధిపతి కుజుడు. రంగు ఎరుపు, ధాన్యం కందులు. ముఖం, మెదడుపై ఈ రాశి ప్రభావం అధికంగా ఉంటుందని చెబుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటే నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి. భావోద్వేగాలను అదుపు చేసుకోలేరు. సవాళ్లు ఎదుర్కొనేందుకు సదా సిద్ధంగా ఉంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా సమస్యల్లో చిక్కుకుంటారు. జాతక చక్రం లో శని, కుజులు అనుకూలించినట్లయితే పోలీసు, మిలటరీ, ఆటోమొబైల్, భూగర్భ రంగాల్లో స్థిరపడే అవకాశాలు ఉంటాయి.
వృషభం: రాశి చక్రంలో రెండోది. సరి, స్థిర, స్త్రీ రాశి. దిశ దక్షిణం. భూ తత్వ రాశి. చిహ్నం ఎద్దు. దీనికి అధిపతి శుక్రుడు. ఈ రాశివారికి సహనం ఎక్కువ. కానీ, ఓర్పు నశిస్తే వీరిని అదుపు చేయడం కష్టమే! శుక్రుడు అధిపతి కావడంతో ఈ రాశిలో జన్మించిన వారికి సహజంగా లలిత కళల్లో అభిరుచి, ప్రవేశం ఉంటుంది. అలంకరణపై శ్రద్ధ వహిస్తారు. జాతక చక్రంలో గురు, బుధులు కూడా అనుకూలంగా ఉన్నట్లయితే ఎలాంటి పనైనా చాకచక్యంగా నెరవేర్చేవారు అవుతారు. విశ్వసనీయులుగా పేరు పొందుతారు. వస్త్ర ఉత్పత్తులు, రసాయనాలు, ప్లాస్టిక్, పాల ఉత్పత్తుల వ్యాపారం వీరికి కలిసి వస్తాయి.
మిథునం: రాశి చక్రంలో మూడోది. బేసి, ద్వి స్వభావ, పురుష రాశి. వాయు తత్వ రాశి. దిశ పశ్చిమం. చిహ్నం మైథున జంట. దీనికి అధిపతి బుధుడు. ఈ రాశి వారికి చురుకైన తెలివితేటలు ఉంటాయి. సందర్భోచితంగా మాట మార్చే నేర్పరితనం ఉంటుంది. రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తారు. సాంకేతిక నైపుణ్యం కలిగి ఉంటారు. సహనం ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఊహాశక్తి, సృజనాత్మకత ఎక్కువ. తరచూ మాట మార్చడం వల్ల అయినవారి ముందు పలుచన అవుతారు. స్థిరత్వం తక్కువగా ఉంటుంది. కామర్స్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, కంప్యూటర్ రంగాల్లో రాణించే అవకాశాలు ఎక్కువ.
కర్కాటకం: రాశి చక్రంలో నాలుగోది. సరి, చర, స్త్రీ రాశి. జల తత్వ రాశి. దిశ ఉత్తరం. చిహ్నం ఎండ్రకాయ. దీనికి అధిపతి చంద్రుడు. ఈ రాశివారు సహజంగా మంచివారుగా ఉంటారు. పట్టుదల ఎక్కువ. అయితే, పట్టు చిక్కే సమయంలో జారవిడిచే స్వభావం ఉంటుంది. చిన్న చిన్న పనులకు కూడా రెండు మూడుసార్లు ప్రయత్నించాల్సి వస్తుంటుంది. అయితే, కార్యం సాఫల్యం అయ్యేవరకు ప్రయత్నం ఆపరు. నిజాయతీగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు. ఎవరు అయిన వారో, ఎవరు కాని వారో తేల్చుకోలేకపోతారు. ఇంజినీరింగ్, అడ్మినిస్ట్రేషన్, బ్యాంకింగ్ రంగాలు వీరికి కలిసి వస్తాయి.
సింహం: రాశి చక్రంలో ఐదోది. బేసి, స్థిర, పురుష రాశి. అగ్ని తత్వ రాశి. దిశ తూర్పు. చిహ్నం సింహం. దీనికి అధిపతి రవి. ఈ రాశి వారు స్థిరచిత్తులై ఉంటారు. ఆత్మ విశ్వాసం ఎక్కువ. స్థానబలం లేకుంటే వెనక్కి తగ్గుతారు. పరోపకారం ప్రధాన కర్తవ్యంగా భావిస్తారు. ఏదో సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కర్తవ్య నిర్వహణలో వ్యక్తిగత సుఖాలనూ త్యాగం చేస్తుంటారు. ఇతరులను త్వరగా నమ్మేస్తారు. అపాత్ర దానం చేస్తుంటారు. వీరికి రవి, కుజ, శని దశలు యోగిస్తాయి. జాతక చక్రంలో ఈ గ్రహాలు బలంగా ఉంటే ఉన్నతస్థితికి చేరుకుంటారు. మీడియా, రాజకీయం, మేనేజ్మెంట్, వైద్య రంగాలు అనుకూలం.
కన్య: రాశులలో ఆరోది. ఇది సరి, ద్విస్వభావ, స్త్రీ రాశి. భూ తత్వ రాశి. దిశ దక్షిణం. చిహ్నం యువతి. అధిపతి బుధు డు. ఈ రాశివారు మృదు స్వభావులు, కాస్త సిగ్గరులు. తమ పనిని తాము శ్రద్ధగా చేసుకుంటారు. ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారు. అంకిత భావంతో కష్టపడతారు. ఒత్తిడి ఎంత ఎక్కువగా ఉన్నా సహనం కోల్పోరు. మనసులోని మాట బయటపెట్టరు. విలాసాలపై మక్కువ ఉన్నా.. బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. కామర్స్, బ్యాంకింగ్, విదేశీ వ్యవహారాలు తదితర రంగాల్లో రాణిస్తారు. వ్యవసాయం, పండ్లతోటలు, పశుపోషణ లాభదాయక రంగాలు.
తుల: రాశిచక్రంలో ఏడోది. ఇది బేసి, చర, పురుష రాశి. వాయు తత్వ రాశి. దిశ పశ్చిమం. చిహ్నం త్రాసు. అధిపతి శుక్రుడు. ఈ రాశిలో జన్మించిన వారు సహనానికి మారుపేరుగా ఉంటారు. నలుగురిలో ఉండటానికి ప్రాధాన్యం ఇస్తారు. మాటకారి తనం ఎక్కువ. ప్రతి విషయంలోనూ మంచి-చెడు బేరీజు వేసుకుంటారు. అతిథులను ఆదరిస్తారు. విపత్కర సమస్యలను సైతం తేలికగా పరిష్కరించే నేర్పు ఉంటుంది. అందాన్ని ఆరాధిస్తారు. కళలపై ఆసక్తి కనబరుస్తారు. విలాసాలపై మక్కువ ప్రదర్శిస్తారు. సినిమా, ఫొటోగ్రఫీ, మీడియా రంగాల్లో రాణిస్తారు. అలంకార వస్తువులు, మద్యం, వినోద సాధనాల వ్యాపారాలు వీరికి లాభసాటిగా ఉంటాయి.
వృశ్చికం: ఇది ఎనిమిదో రాశి. సరి, స్థిర, స్త్రీ రాశి. జల తత్వ రాశి. దిశ ఉత్తరం. చిహ్నం తేలు. అధిపతి కుజుడు. ఈ రాశిలో జన్మించిన వారికి ధైర్యసాహసాలు ఎక్కువగా ఉంటాయి. దూకుడుగా వ్యవహరిస్తారు. మొండితనం ఎక్కువ. నిజాయతీగా వ్యవహరిస్తారు. ఆవేశం వల్ల సమస్యల్లో చిక్కుకుంటారు. మార్మిక విద్యలపై ఆసక్తి కనబరుస్తారు. పైకి ఎంత ధైర్యంగా కనిపిస్తారో లోపల అంత పిరికివారుగా ఉంటారు. నమ్మకాలు ఎక్కువ. అకస్మాత్తుగా కుంగుబాటుకు గురవుతుంటారు. వైద్యం, న్యాయవాద విద్య, వ్యాయామ విద్యలో రాణిస్తారు. మిలటరీ, పోలీసు, గూఢచర్య ఉద్యోగాలు అనుకూలం. వృత్తి, వ్యాపారాల్లో పోటీతత్వాన్ని ఇష్టపడతారు.
ధనుస్సు: ఇది తొమ్మిదో రాశి. బేసి, ద్విస్వభావ, పురుష రాశి. అగ్ని తత్వ రాశి. దిశ తూర్పు. చిహ్నం ఎక్కుపెట్టిన విల్లు. అధిపతి గురువు. ఈ రాశిలో జన్మించిన వారు అందంగా ఉంటారు. సహృదయులుగా పేరు తెచ్చుకుంటారు. నొప్పింపక తానొవ్వక అన్న చందాన వ్యవహరిస్తారు. సందర్భోచితంగా మాట్లాడతారు. పట్టుదల ఎక్కువ. ఒక పనిని సాధించడానికి రెండు మూడు మార్గాల్లో ప్రయత్నిస్తారు. ప్రతిఫలం ఆశించకుండా ఇతరులకు సాయం చేస్తారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయవిద్య, ఇంజినీరింగ్, కామర్స్ విద్యలో రాణిస్తారు. బ్యాంకింగ్, మేనేజ్మెంట్ రంగాలు అనుకూలం.
మకరం: ఇది పదో రాశి. సరి, చర, స్త్రీ రాశి. భూ తత్వం, సౌమ్య స్వభావ రాశి. దిశ దక్షిణం. చిహ్నం మొసలి. అధిపతి శని. ఈ రాశిలో క్రమశిక్షణతో మసలుకుంటారు. విశ్వసనీయత వీరి బలం. ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరిస్తారు. రాజీపడేందుకు ఇష్టపడరు. సహనంతో ఎంతటి లక్ష్యాలనైనా సాధిస్తారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. బద్ధకస్థులను అస్సలు సహించరు. తమ వైఖరికి భిన్నంగా వ్యవహరించేవారిని దూ రం పెడతారు. నమ్ముకున్న వారికి ఆసరాగా ఉంటారు. సివిల్, మెకానికల్, గ నులకు సంబంధించిన విద్యల్లో రాణిస్తారు. విద్యాబోధన, గృహనిర్మాణం, గనులు, రాజకీయ రంగాల్లో రాణిస్తారు.
కుంభం: ఇది పదకొండో రాశి. బేసి, స్థిర, పురుష రాశి. వాయు తత్వ రాశి. దిశ పశ్చిమం. చిహ్నం నిండు కుండ. అధిపతి శని. ఈ రాశిలో పుట్టినవారు అంత త్వరగా దేనికీ లొంగరు. విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఆత్మసాక్షి మేరకు నడుచుకుంటారు. నిష్పాక్షికంగా వ్యవహరిస్తారు. శాస్త్ర పరిశోధనలపై ఆసక్తి కనబరుస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరుస్తారు. ఒక్కసారి నిశ్చయించుకుంటే మళ్లీ వెనక్కి తగ్గరు. కొన్ని సందర్భాల్లో చాలా మొండిగా ఉంటారు. పరిశోధనలు, శాస్త్ర విద్యల్లో రాణిస్తారు. సివిల్ ఇంజినీరింగ్, నిఘా విభాగంలో అవకాశాలు పొందవచ్చు. ఉక్కు, ఇతర లోహాలకు చెందిన వ్యాపారాలు అనుకూలం.
మీనం: రాశి చక్రంలో చివరిది మీనం. సరి, ద్విస్వభావ, స్త్రీ రాశి. జల తత్వ రాశి. దిశ ఉత్తరం. చిహ్నం చేప. అధిపతి గురువు. ఈ రాశిలో పుట్టినవారు కాస్త నెమ్మదస్తులు. ఒత్తిడిని తట్టుకోలేరు. సృజనాత్మకత వీరి బలం. తెలివిగా పనులు చక్కబెడతారు. శరీరానికి కష్టం కలగకుండా పనులు చేస్తుంటారు. అత్యవసరమైతే తప్ప ధైర్యాన్ని ప్రదర్శించరు. ఇతరుల మనసు నొప్పించడం ఇష్టం లేక తమ అభిప్రాయాలు మార్చుకుంటారు. వాక్చాతుర్యం కలిగి ఉంటారు. రచన వ్యాసంగంపై అభిరుచి ఉంటుంది. రసాయన నిపుణులు, వైద్యం, ఉపాధ్యాయ వృత్తిలో రాణించవచ్చు. విద్యారంగం, హైడల్ పవర్, బ్యాంకింగ్‌లో పెట్టుబడులు అనుకూలిస్తాయి.